ఆర్ఆర్ఆర్‌ ముంబయి ఈవెంట్ ట్విస్ట్‌... న్యూ ఇయర్ స్పెషల్‌

Update: 2021-12-19 15:30 GMT
జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్‌ ఆర్‌ ఆర్‌ సంక్రాంతి సందర్బంగా జనవరి 7వ తారీకున విడుదల అవ్వబోతుంది. తెలుగు రాష్ట్రాలు.. సౌత్‌ ఇండియాలోనే కాకుండా ఉత్తరాదిన కూడా భారీ ఎత్తున విడుదల అవ్వబోతుంది. రాజమౌళి సినిమా కనుక సౌత్ లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో బాలీవుడ్ లో కూడా అదే స్థాయి క్రేజ్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు అక్కడ భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. నేడు చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా ముంబయిలో భారీ ఈవెంట్‌ లో పాల్గొన్నారు. బాలీవుడ్‌ స్టార్స్ ముఖ్య అతిథులుగా హాజరు అయిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చూడాలని తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిని కనబర్చారు. కాని అనూహ్యంగా ఈ మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను లైవ్ ఇవ్వలేదు.

సాదారణంగా అయితే మన తెలుగు సినిమాల ప్రీ రిలీజ్ వేడుకలు పదుల సంఖ్యలో టీవీ ఛానెల్స్ మరియు యూట్యూబ్‌ ఛానెల్స్ లైవ్ ఇస్తూ ఉంటాయి. కాని ఆర్ ఆర్ ఆర్‌ సినిమా ప్రీ రిలీజ్ వేడుక టెలికాస్ట్‌ రైట్స్‌ ను స్టార్‌ ప్లస్ వారు పెద్ద మొత్తానికి కొనుగోలు చేశారట. వారు కనీసం స్టిల్స్ ను కూడా బయటకు విడుదల కాకుండా జాగ్రత్త పడ్డారట. మొత్తం రెండు వేల మంది వరకు హాజరు అయిన ఆర్ ఆర్ ఆర్‌ ముంబయి ప్రీ రిలీజ్ వేడుకలో ఈ బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ పాల్గొన్నాడు అనేది టాక్. అందుకే ఈ ఈవెంట్‌ ను స్టార్‌ ప్లస్ వారు ప్రత్యేక సందర్బంలో టెలికాస్ట్‌ చేయడం కోసం హోల్ట్‌ లో పెట్టారట. సినిమా విడుదల ఎలాగూ వచ్చే ఏడాది జనవరి 7వ తారీకున విడుదల కాబోతుంది. కనుక కాస్త ఆలస్యంగానే ఈ వేడుకను టెలికాస్ట్ చేస్తారని  తెలుస్తోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం స్టార్‌ ప్లస్ వారు డిసెంబర్ 31 రాత్రి ఈ మెగా ఈవెంట్‌ ను టెలికాస్ట్‌ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఈవెంట్‌ లో రామ్‌ చరణ్ మరియు ఎన్టీఆర్ లు స్టేజ్ పై డాన్స్ చేయడంతో పాటు హీరోయిన్ ఆలియా కూడా సందడి చేసిందనే టాక్ ఉంది. ఇంకా ఈ వేడుక చాలా స్పెషల్‌ గా ఉంటుంది కనుక ప్రత్యేక సందర్బం అయినా న్యూ ఇయర్ నైట్‌ లో టెలికాస్ట్ చేస్తే రేటింగ్‌ బాగుంటుందనే ఉద్దేశ్యంతో స్టార్‌ వారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆర్ ఆర్‌ ఆర్ ముంబయి ఈవెంట్‌ గురించి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో లైవ్ లేకపోవడం ప్రతి ఒక్కరికి నిరాశ కలిగించింది.
Tags:    

Similar News