కరోనాపై బెంబేలెత్తించిన వ్యక్తితో వర్మ ఇంటర్వ్యూ

Update: 2021-06-15 13:30 GMT
పరుచూరి మల్లిక్.. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశం అవుతున్న పేరు. ఈయనొక కెమికల్ ఇంజినీర్. కరోనా వైరస్ మీద విస్తృతమైన అవగాహన ఉన్నట్లుగా ఆయన ఈ మధ్య సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అలాగే టీవీ చర్చల్లోనూ బలంగా తన వాయిస్ వినిపిస్తున్నారు. ఆయన కరోనా థర్డ్ వేవ్ గురించి జనాలను బెంబేలెత్తించేలా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. కరోనా కొత్త వేరియెంట్ అత్యంత ప్రమాదకరమైందని.. దీని కారణంగా మూడో వేవ్ ప్రళయం మామూలుగా ఉండదని.. ఇంటికొకరు చనిపోతారని ఆయన అంచనా వేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయింది. ఐతే మల్లిక్ వ్యాఖ్యలను పలువురు ఖండించారు. అనవసరంగా జనాలను భయపెట్టేస్తున్నాడని.. డాక్టర్లను మించి వైరస్ గురించి మాట్లాడేస్తున్నాడంటూ ఆయనపై వైద్య నిపుణులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

జనాలను ప్యానిక్ చేస్తున్నాడంటూ తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకుడు గడల శ్రీనివాసరావు.. పరుచూరి మల్లిక్ మీద హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ  విషయాన్ని వెల్లడించారు. మల్లిక్ తీరును ఆయన కూడా తప్పుబడుతూ విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే.. తాను కరోనా విషయమై జనాలను హెచ్చరిస్తుంటే తనపై కేసులు పెట్టడమేంటని అంటున్నారు మల్లిక్. తాను బెయిల్ కోసం అప్లై చేయనని.. జనాలే తనను బయటికి తీసుకొస్తారని ఆయన ఫేస్ బుక్‌లో పోస్టు పెట్టడం విశేషం. ఇదిలా ఉంటే.. మల్లిక్ కరోనా థర్డ్ వేవ్‌పై చేసిన హెచ్చరికల తాలూకు వీడియోలను పోస్ట్ చేస్తూ కొన్ని రోజులుగా రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో కామెంట్లు చేస్తున్నాడు.

మల్లిక్ మాట్లాడింది తప్పయితే అతణ్ని అరెస్ట్ చేయాలని, లేదంటే రాష్ట్రానికి అధిపతి చేయాలని ఆయన ఇంతకుముందు వ్యాఖ్యానించడం విశేషం. మల్లిక్ వార్తల్లో వ్యక్తిగా మారిన నేపథ్యంలో వర్మ ఆయనతో ఇంటర్వ్యూ చేయడం విశేషం. ఇదొక సంచలనాత్మక ఇంటర్వ్యూ అని ఆయన ఊరిస్తున్నాడు. త్వరలోనే ఆ ఇంటర్వ్యూ వీడియోను ఆయన జనాల్లోకి వదలబోతున్నాడు.
Tags:    

Similar News