బ్రేకుల్లేని బండిలా డౌన్ లోకి జార‌కు రాజా!

Update: 2020-03-16 04:29 GMT
మాస్‌ మహారాజా రవితేజ లేట్‌ వయసులో హీరోగా ఎంట్రీ ఇచ్చినా టీనేజ‌ర్ లా అద్భుత‌మైన ఎన‌ర్జీతో స‌త్తా చాటాడు. 35 ప్ల‌స్ హీరో.. 40 ప్ల‌స్ డెబ్యూ హీరోల జాబితాలో మోస్ట్ ఎన‌ర్జిటిక్ హీరో అనిపించాడు. సాధ్యమైనంత వేగంగా సినిమాలు చేసేయ‌డం రాజా స్టైల్ అని ప్రూవ్ చేశాడు. ఈ క్రమంలో ఆయనకు సక్సెస్‌ ల కంటే ఫెయిల్యూర్సే ఎక్కువగా ఉన్నాయనే విమ‌ర్శ‌లు ఉన్నాయి. సినిమాల స్పీడు పెంచడంలో ఉన్న దృష్టి మంచి కథలను ఎంపిక చేసుకోవడంలో రవితేజకి లేదనే కామెంట్స్ తరచూ వినిపిస్తున్నాయి. ఇటీవల వరుసగా నాలుగు సినిమాలు పరాజయం చెందినా రవితేజలో స్పీడ్‌ ఏమాత్రం తగ్గడం లేదు. బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలకు ఓకే చెబుతూ దూకుడు పెంచేస్తూనే ఉన్నాడు. క‌థ‌తో క‌న్విన్స్ చేస్తే సెట్స్ కెళ్ల‌డ‌మే అన్న‌ట్టు ఉంది రాజా ఇస్పీడ్.

ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో `క్రాక్‌` చిత్రంలో నటిస్తున్నాడు. శృతి హాసన్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం మేలో విడుదల కానుంది. దీంతోపాటు `రాక్షసుడు` ఫేమ్‌ రమేష్‌ వర్మ దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. తొలి సినిమా `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`తో ఫెయిల్యూర్ ఎదుర్కొన్న డైరెక్టర్‌ వక్కంతం వంశీతో ఓ సినిమా చేయబోతున్నట్టు ఇటీవలే అధికారికం గా ప్రకటించారు.

తనే వరుసగా ఫెయిల్యూర్ లో ఉండగా.. మరో ఫెయిల్యూర్‌ డైరెక్టర్ తో సినిమా చేయడమేంటి? అనే కామెంట్‌ నెటిజనుల నుంచి.. ఇండస్ట్రీ వర్గాల నుంచి బ‌లంగా వినిపించింది. ఇదే కాదు సినిమా చూపిస్తా మామ.. నేను లోకల్‌ డైరెక్టర్‌ త్రినాథ రావు నక్కినతోనూ ఓ సినిమా కి కమిట్‌ అయ్యాడట. గతంలో ఈ వార్త వినిపించినా.. తాజాగా రవితేజ కన్ఫమ్‌ చేసినట్టు సమాచారం.

నిజానికి త్రినాథరావు నక్కిన అలా ఎలా న‌క్క‌తోక తొక్కాడు? అంటే.. తొలుత‌ వెంకటేష్ తో సినిమా చేయాల‌ని అనుకున్న అత‌డికి ఎందుక‌నో అది వర్కౌట్‌ కాలేదు. ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఓ సినిమాకి ప్ర‌య‌త్నించాడు. కానీ అదీ కుద‌ర‌లేదు. తాజాగా రవితేజ పేరు మెయిన్‌ స్ట్రీమ్ లోకి వచ్చింది. మరోవైపు వరుస పరాజయాలతో రవితేజ ఇమేజ్‌ కూడా పడిపోతున్నా ఆయ‌న లెక్క‌లేంటో అంతు చిక్క‌డం లేదు మ‌రి. అంతేకాదు ప్రతి సినిమాల్లో ఆయన యాక్టింగ్‌.. ఎక్స్ ప్రెషన్స్ ఒకేలా ఉంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఒకే బాడీ లాంగ్వేజ్‌.. డైలాగ్‌ డెలివరీ.. మాడ్యులేషన్స్ అన్నీ ఒకేలా ఉండటం తో ఆయన సినిమాలు కాస్త బోరింగ్ గా ఉంటున్నాయనే కామెంట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రవితేజ ఇక హీరోగా కాకుండా.. విలన్‌గానో.. లేక జగపతిబాబు తరహాలో మెయిన్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానో చేసుకుంటే బెటర్‌ అనే సలహాలు నెటిజనుల నుంచి వస్తున్నాయి. మరి ఇవన్నీ ఆలోచించి రవితేజ కెరీర్ ని టర్న్ తీసుకుంటాడా? లేక నా రూటే సపరేటు అంటూ వరుస సినిమాలతో దూసుకు పోతాడా అన్నది చూడాలి.
Tags:    

Similar News