రాజ‌మౌళి మీద గుర్రుగా ఉన్న తారక్ - చ‌ర‌ణ్ ఫ్యాన్స్..!

Update: 2021-12-29 14:26 GMT
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న చిత్రం ''ఆర్‌.ఆర్‌.ఆర్‌''. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. విప్లవవీరులు అల్లూరి సీతామరామరాజు - కొమురం భీమ్ నిజ జీవితాల ఆధారంగా కల్పిత కథతో ఈ బిగ్గెస్ట్ ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాని రూపొందించారు.

కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ 2022 జనవరి 7న RRR చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా అత్యధిక స్క్రీన్ లలో రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా శరవేగంగా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓవైపు సినిమాకు సంబంధించిన కంటెంట్ వదులుతూ అభిమానులను ఉత్సాహపరుస్తూనే.. మరోవైపు వరుస ఈవెంట్లు - ఇంటర్వ్యూలతో జాతీయ స్థాయిలో సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేలా చేసారు.

RRR బృందం నార్త్ మార్కెట్ మీద ఎక్కువగా దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే సల్మాన్ ఖాన్ - కరణ్ జోహార్ వంటి బాలీవుడ్ ప్రముఖుల గెస్టులుగా ముంబైలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అలానే హిందీ ఎలక్ట్రానిక్ మరియు వెబ్ మీడియాలకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఇక చెన్నైలో శివ కార్తికేయన్ - ఉదయనిధి స్టాలిన్ వంటి కోలీవుడ్ స్టార్స్ అతిథిలుగా మరో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసారు.

ఇదే క్రమంలో మలయాళ ఇండస్ట్రీని కవర్ చేయడానికి బుధవారం కేరళలోని తిరువనంతపురంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ వేడుక జరిపారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాకు అన్ని ఇండస్ట్రీలలో పాజిటివ్ వైబ్స్ ఏర్పడేలా పబ్లిసిటీ చేయడంలో జక్కన్న అండ్ టీమ్ సక్సెస్ అయింది. దీంతో టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాస్తా పాన్ ఇండియా స్టార్స్ గా మారిపోతారని అందరూ భావిస్తున్నారు.

అయితే తమ అభిమాన హీరోలకు నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చిపెడుతున్నా.. నందమూరి - మెగా ఫ్యాన్స్ మాత్రం రాజమౌళి మీద గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. దీనికి కారణం RRR సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తెలుగు రాష్ట్రాల్లో చేయ‌డంపై ఇంకా క్లారిటీ ఇవ్వ‌కపోవడమే. అన్ని ఇండస్ట్రీలలో బజ్ క్రియేట్ అయ్యేలా ప్రమోషన్స్ చేస్తున్నప్పటికీ.. తెలుగు ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన అప్డేట్ ఇవ్వకపోవడంపై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

బాక్సాఫీస్ వద్ద పోటీ పడే రెండు పెద్ద సినీ ఫ్యామిలీలకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో.. మొదటి నుంచి కూడా 'ఆర్.ఆర్.ఆర్' సినిమాపై అందరిలో ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. ఇక ఈ సినిమా ఈవెంట్ లలో రామ్ చరణ్ - తారక్ లతో పాటుగా మెగా - నందమూరి కుటుంబాలకు చెందిన హీరోలు వేదికను పంచుకుంటే చూడాలని ఆశగా వేచి చూస్తున్నారు. కాకపోతే ఇంతవరకు తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ మీద క్లారిటీ ఇవ్వకపోవడం ఫ్యాన్స్ ని నిరాశకు గురిచేస్తోంది. మరి త్వరలోనే దీనిపై మేకర్స్ స్పష్టత ఇస్తారేమో చూడాలి.

ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు రోజురోజుకీ పెరుగుతున్న తరుణంలో ఆర్.ఆర్.ఆర్ సినిమాపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఢిల్లీలో థియేటర్లు మూతపడటం.. మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూతోపాటుగా 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా హాళ్లు నడవడం వంటివి సినీ ప్రియులను టెన్షన్ పెడుతున్నాయి. ఈ క్రమంలో ‘RRR’ విడుదల వాయిదా పడే అవకాశం ఉందని టాక్ నడిచింది.

ఈనేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్‌ సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ బుధవారం ఓ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమా వాయిదా పడటం లేదని.. ముందుగా ప్రకటించిన తేదీకే రిలీజ్ అవుతుందని రాజమౌళి తనతో చెప్పినట్లు తరణ్‌ పేరొన్నారు.
Tags:    

Similar News