బుల్లితెరపై‌ 'రామాయ‌ణం' మ‌ళ్లీ బంప‌ర్ హిట్

Update: 2020-05-01 07:00 GMT
క‌రోనా క‌ల్లోలం నేపథ్యంలో జ‌నం టీవీల‌కు అతుక్కుపోతున్న సంగ‌తి తెలిసిందే. పాత‌వాటినే తిప్పి తిప్పి వేస్తున్నా త‌ప్ప‌ని స‌న్నివేశంలో వాటినే చూస్తున్నారు. అయితే ఇలా పాత‌దే అయినా టీవీలో వ‌స్తోంది అన‌గానే `రామాయ‌ణం` సీరియ‌ల్ కోసం జ‌నం ఎంత‌గా ప‌రిత‌పించారో తెలుసుకుంటే షాక్ తిన‌కుండా ఉండ‌లేం. ఇప్పుడు నంబ‌ర్ వ‌న్ టీఆర్పీ ఉన్న ఏకైక సీరియ‌ల్ గా డీడీలో రామానంద్ సాగ‌ర్ `రామాయ‌ణం` స‌రికొత్త సంచ‌ల‌నానికి తెర తీసింది. ముఖ్యంగా ఏప్రిల్ 16 న 7.7 కోట్ల మంది వీక్ష‌ణ‌తో అత్యధికంగా వీక్షించిన షోగా   `రామాయణం` నిలిచింది. ఆ మేర‌కు డిడి ఇండియా తన అధికారిక ట్విట్టర్ లో ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించింది. స్వ‌చ్ఛందంగా ప్రజల డిమాండ్ మేరకు మార్చి 28 నుంచి మళ్లీ `రామాయణం` డీడీఓ పునఃప్రసారం అవుతోంది. జ‌నం మ‌రోసారి టీవీల‌కు అతుక్కుపోయి అత్యుత్త‌మ టీఆర్పీని క‌ట్ట‌బెట్టారు.

రామాయ‌ణం మొదటిసారి డీడీలో ప్రసారం అయినప్పుడు ప్రజాదరణ ప‌రంగా అప్ప‌టికి ఉన్న అన్ని రికార్డులను బద్దలుకొట్టింది. తాజాగా రిపీట్ వేసినా చరిత్రను మళ్ళీ పునరావృతం చేసింది. రామనంద్ సాగర్ ఈ సీరియల్ ని మొత్తం 78 ఎపిసోడ్లుగా తెర‌కెక్కించారు. వాల్మీకి రామాయణం.. తులసీదాస్ రామ్‌చరిత్ర‌ ఆధారంగా ఈ సీరియ‌ల్ ని రూపొందించారు .దేశంలో మొదటిసారి.. ఈ సీరియల్ తొలిగా 25 జనవరి 1987 నుండి 31 జూలై 1988 వరకు ప్రసారమైంది. ప్రతి ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఈ కార్యక్రమం టీవీలో ప్రసారం అయ్యేది. 1987 నుండి 1988 వరకు `రామాయణం` ప్రపంచంలో అత్యధికంగా వీక్షించిన సీరియల్ ‌గా నిలిచింది. జూన్ 2003 నాటికి ఇది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ప్రపంచంలో అత్యధికంగా వీక్షించిన పౌరాణిక సీరియల్ గా రికార్డ్ ల‌కెక్కింది. నాటి రోజుల్లో టీవీలు త‌క్కువ‌గా ఉండ‌డంతో ప‌క్క ఇళ్ల‌కు వెళ్లి మ‌రీ జ‌నం ఇర‌గ‌బ‌డి చూసేవారు. నేటిత‌రానికి ఒకే ఇంట్లో రెండు మూడు టీవీలు అందుబాటులో ఉండ‌డంతో ఇంకా ఆస‌క్తిగా చూశార‌ని తెలుస్తోంది.

ఇక పురాణేతిహాసాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన `మ‌హాభార‌తం` సీరియ‌ల్ ఇప్ప‌టికే టీవీల్లో రిపీట‌వుతోంది. దీనికి ఆద‌ర‌ణ అద్భుతంగా ఉంద‌న్న స‌మాచారం ఉంది. రామాయ‌ణం- మ‌హాభార‌తం లాంటి ఎపిక్స్ ని చూసేందుకు రూల్స్ అక్క‌ర్లేదు. అవి ఎట‌ర్న‌ల్ అని ప్ర‌తిసారీ ప్రూవ్ అవుతోంది. ఇక మ‌హ‌మ్మారీ త‌రుముకొస్తుంటే మ‌న పురాణాలు గుర్తుకొచ్చాయా ప్ర‌జ‌ల‌కు అన్న కామెంట్లు కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి మ‌రి!
Tags:    

Similar News