గుజరాత్ పెళ్లిలో టేలర్ స్విఫ్ట్ ప్రదర్శన.. నిజమా అని ఆరా తీస్తే!
ఈ వేడుక జామ్‌నగర్‌లో ప్రముఖ వ్యాపారవేత్తలైన అహానా రహేజా, యష్ పటేల్ ల వివాహం సందర్భంగా జరిగింది.;
గుజరాత్ జామ్ నగర్‌లో పెళ్లి అనగానే అంబానీల వెడ్డింగ్ గుర్తుకు వస్తుంది. అక్కడ దిగ్గజ పాప్ స్టార్లు రిహానా, జెన్నిఫర్ లోపేజ్, కిమ్ కర్ధాషియన్- ఖోలే కర్ధాషియన్ వంటి ప్రముఖుల ప్రదర్శనలు గుర్తుకు వస్తాయి. కానీ ఇప్పుడు గుజరాత్ జామ్‌నగర్‌లో జరిగిన ఒక పెళ్లిలో అమెరికన్ పాప్ స్టార్ `టేలర్ స్విఫ్ట్` ప్రదర్శన ఇచ్చిందని ప్రచారం సాగుతోంది.
అయితే ఇది నిజమేనా? కచ్ఛితంగా టేలర్ స్విఫ్ట్ అని అనుకోవచ్చా? అంత పెద్ద పాప్ స్టార్ ని దించేసేంత పెద్ద ధనికులు ఎవరున్నారు? అన్నది ఆరా తీస్తే.,..వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తున్నది టేలర్ స్విఫ్ట్ కాదు.. ఆమెను పోలి ఉండే యాష్లే లీచిన్ . ఈమె టేలర్ స్విఫ్ట్‌కు డూప్ (డాపులాంగర్)గా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ భామ టేలర్ స్విఫ్ట్ లాగే డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్, స్టేజ్ మానరిజమ్స్‌ను అచ్చుగుద్దినట్లుగా అనుకరిస్తుంది.
ఈ వేడుక జామ్‌నగర్‌లో ప్రముఖ వ్యాపారవేత్తలైన అహానా రహేజా, యష్ పటేల్ ల వివాహం సందర్భంగా జరిగింది. చాలా మంది నెటిజనులు ఇది అంబానీ కుటుంబం ఏర్పాటు చేసిన వేడుక అని తప్పుగా భావించారు. కానీ ఇది రహేజా-పటేల్ కుటుంబాల వివాహం. అసలు కన్ఫ్యూజన్ ఎందుకు అన్నది ఆరా తీస్తే తెలిసిన సంగతులివి..
పెళ్లిలో యాష్లే లీచిన్ నేరుగా టేలర్ స్విఫ్ట్ పాపులర్ ఎరాస్ టూర్ తరహా మెరిసే వెండి రంగు దుస్తులు ధరించి టేలర్ పాపులర్ సాంగ్ లవ్ స్టోరి కి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. వీడియో క్వాలిటీ అంత స్పష్టంగా లేకపోవడం, ఆమె రూపం టేలర్ స్విఫ్ట్‌ను పోలి ఉండటంతో స్విఫ్ట్ రహస్యంగా ఇండియాకు వచ్చిందని అభిమానులు నమ్మారు. అయితే విమానాశ్రయంలో ఎలాంటి ఫోటోలు లేకపోవడం.. స్టిల్ కెమెరామెన్ల కంట పడకపోవడంతో కొందరు అనుమానం వ్యక్తం చేశారు.. చివరకు అది డూప్ అని తేలిపోయింది.
తాజా సమాచారం ప్రకారం,.. టేలర్ స్విఫ్ట్ ప్రస్తుతం ఇండియాలో లేదు. ఈ గాయని లండన్‌లో ఉన్నట్లు కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇప్పటివరకు టేలర్ స్విఫ్ట్ అధికారికంగా ఇండియాలో ఎలాంటి కచేరీ గానీ.. ప్రైవేట్ పెర్ఫార్మెన్స్ గానీ ఇవ్వలేదు.
అయితే ప్రస్తుతం ఇండియాలో టెయిలర్ స్విఫ్ట్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఈ వైరల్ వీడియో నిరూపిస్తోంది. ఒకవేళ స్విఫ్ట్ నిజంగానే ఇండియాకు వస్తే అది ఎంత పెద్ద సెన్సేషన్ అవుతుందో ఊహించలేనిది.