#MSG స‌న్మానం: మెగాస్టార్‌కి మ‌రో అరుదైన గౌర‌వం

కె.వి. రావు స్వ‌యంగా ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక సమావేశం టాలీవుడ్ ప్రముఖుల కలయికకు వేదికైంది.;

Update: 2026-02-22 14:53 GMT

మెగాస్టార్ చిరంజీవికి దక్కిన మరో అద్భుతమైన గౌరవం ఇది. #MSG (మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు) పేరుతో ఆయన సినీ ప్రస్థానాన్ని, ఘ‌న విజయాన్ని వేడుకగా జరుపుకోవడం అభిమానులలో ఉత్సాహం నింపుతోంది.




 


కె.వి. రావు స్వ‌యంగా ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక సమావేశం టాలీవుడ్ ప్రముఖుల కలయికకు వేదికైంది. ఈ వేడుకకు సంబంధించిన విశేషాలు ప‌రిశీలిస్తే.. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు, అల్లు అర‌వింద్, అశ్వ‌నిద‌త్, డి సురేష్ బాబు స‌హా దిగ్గజాల సమక్షంలో మెగాస్టార్ కి ప్ర‌త్యేక‌ సన్మానం జ‌రిగింది.




 


ముఖ్యంగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు చిరంజీవిని మాస్ హీరోగా, కమర్షియల్ కింగ్‌గా తీర్చిదిద్దిన గురువు. ఆయ‌న కార‌ణంగానే అనీల్ రావిపూడితో చిరంజీవి ప్రాజెక్ట్ సెట్ అయింద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి 300కోట్ల క్ల‌బ్ హీరోగా రికార్డుల‌కెక్కారు. ఇక ఇదే వేడుక‌లో వైజయంతీ మూవీస్ అధినేత అశ్వ‌నిదత్‌ కూడా ఉన్నారు. ఆయ‌న‌ చిరంజీవితో `జగదేకవీరుడు అతిలోకసుందరి` స‌హా ప‌లు ఇండస్ట్రీ హిట్లు తీసిన మిత్రుడు.




 


నేటి తరం దర్శకులలో అనిల్ రావిపూడి, బాబీ, బుచ్చిబాబు త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. మెగాస్టార్ చిరంజీవి తరతరాల దర్శకులకు ఎంత‌గా స్ఫూర్తినిస్తున్నారో ఈ వేడుక చెబుతోంది. వారంద‌రినీ చిరు ఎంతో ఆప్యాయంగా ఆలింగ‌నం చేసుకుని ప‌ల‌క‌రించ‌డం చూస్తుంటే, అక్క‌డ బిగ్ హోప్ క‌నిపిస్తోంది.




 


ఈ వేడుక కేవలం ఒక సినిమా సక్సెస్ గురించి మాత్రమే కాదు..మన శంకర వరప్రసాద్ గారు దశాబ్దాలుగా నిర్మించుకున్న సాటిలేని సామ్రాజ్యం, ఆయ‌న‌ లెగసీకి గుర్తు. `పద్మ విభూషణ్` గౌరవం తర్వాత ఇండస్ట్రీలో చిరంజీవి పై గౌరవం మరింత పెరిగింది. ఇటీవ‌లి కాలంలో ఎన్నో ప్ర‌యోగాలు.. వాల్తేరు వీర‌య్య నుంచి విశ్వంభ‌ర వ‌ర‌కూ విభిన్న‌మైన చిత్రాల‌ను చిరు ఎంపిక చేసుకోవ‌డం నిజంగా ఆస‌క్తిక‌రం.




 


సోషల్ మీడియాలో #MSG హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అభిమానులు తమ హీరోని శంకర వరప్రసాద్ అనే చిరు అసలు పేరుతో ఇలా గౌరవించుకోవడం వారి మధ్య ఉన్న ఆత్మీయతను తెలియజేస్తోంది. ఇక‌పోతే ఇదే వేదిక వ‌ద్ద అనీల్ రావిపూడి చిరంజీవితో కేక్ క‌ట్ చేయించి సెల‌బ్రేష‌న్ ని నిర్వ‌హించారు.




 


విశ్వంభర గురించి..

ఈ వేడుకల్లో చిరంజీవి త‌న‌ తదుపరి సోషియో-ఫాంటసీ మూవీ `విశ్వంభర` గురించి కూడా ఆసక్తికరమైన చర్చలు జరిగినట్లు సమాచారం. భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో వస్తున్న ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో మరో మైలురాయి అవుతుందని చిత్ర బృందం ధీమాగా ఉంది.

ఒక సామాన్య యువకుడిగా వచ్చి సుప్రీం హీరోగా, మెగాస్టార్ గా ఎదిగారు చిరంజీవి. ఆయ‌న జీవితం ఇప్పటికీ ఎంతో మంది నటులకు పాఠం లాంటిది.

Tags:    

Similar News