డాన్ 3పై అవన్నీ తప్పుడు సిద్ధాంతాలే
ఫర్హాన్ అఖ్తర్ `డాన్ 3` ప్రాజెక్ట్ గురించి ప్రస్తుతం బాలీవుడ్‌లో గందరగోళపరిచే వార్తలు పుట్టుకొస్తున్నాయి.;
ఫర్హాన్ అఖ్తర్ `డాన్ 3` ప్రాజెక్ట్ గురించి ప్రస్తుతం బాలీవుడ్‌లో గందరగోళపరిచే వార్తలు పుట్టుకొస్తున్నాయి. రణ్ వీర్ తప్పుకున్న తర్వాత షారూఖ్ ని ఫర్హాన్ సంప్రదించాడని, అట్లీ దర్శకత్వంలో అయితే నటిస్తానని షారూఖ్ అన్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత షారూఖ్ తో కుదరక, హృతిక్ రోషన్ కి కూడా ఫర్హాన్ టచ్ లోకి వెళ్లాడని ప్రచారం సాగింది. కానీ ఇవన్నీ కేవలం అనుమానాలతో కూడుకున్న థియరీలు అని కొట్టి పారేస్తున్నారు.
దర్శకత్వం వదలడు..
గతంలో ఫర్హాన్ ఈ సినిమా దర్శకత్వం నుంచి తప్పుకుంటున్నారని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. `డాన్` అనేది ఫర్హాన్ సొంత ఫ్రాంచైజీ. కాబట్టి, నిర్మాతగా, సమర్థుడైన దర్శకుడిగా ఆయన ఈ ప్రాజెక్ట్‌ను వేరే ఎవరికీ ఇచ్చే ప్రసక్తే లేదని తెలుస్తోంది.
షారుఖ్ ఖాన్- అట్లీ రూమర్స్..
రణవీర్ సింగ్ తప్పుకున్న తర్వాత ఫర్హాన్ మళ్ళీ షారుఖ్ ఖాన్‌ను సంప్రదించారని, కానీ షారుఖ్ `జవాన్` దర్శకుడు అట్లీ అయితేనే చేస్తానని కండిషన్ పెట్టారని వచ్చిన వార్తలను కూడా ఇన్‌సైడర్స్ కొట్టిపారేశారు. అసలు రణవీర్ ఎగ్జిట్ తర్వాత ఫర్హాన్ మళ్ళీ షారుఖ్ దగ్గరికి వెళ్లనే లేదని సమాచారం.
రణ్ వీర్ తో వివాదం..
రణవీర్ సింగ్ ఈ సినిమా నుంచి తప్పుకోవడం ఇప్పుడు ఒక పెద్ద వివాదంగా మారింది. రణవీర్ తప్పుకోవడం వల్ల జరిగిన ప్రీ-ప్రొడక్షన్ నష్టాలకు గాను ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్ సుమారు 40 కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ గొడవను సరిదిద్దడానికి అమితాబ్ బచ్చన్, ఆమీర్ ఖాన్ వంటి వారు ప్రయత్నిస్తున్నట్లు కూడా ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అయితే తనతో మాట్లాడుతూనే హృతిక్ కి టచ్ లో ఉన్నాడని ఫర్హాన్ పై రణ్ వీర్ సీరియస్ అయ్యాడు. స్క్రిప్టు నచ్చనప్పుడే చేయడం కుదరదని తెగేసి చెప్పాడు. చివరికి హృతిక్ రోషన్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తనను డాన్ పాత్ర కోసం ఫర్హాన్ సంప్రదించలేదని హృతిక్ స్వయంగా క్లారిటీనిచ్చారు.
అతిపెద్ద ట్విస్ట్.. ఫర్హానే డాన్?
ఇంతలోనే ఒక కొత్త అప్ డేట్ ఆశ్చర్యపరిచింది. అన్నింటికంటే షాకింగ్ అప్‌డేట్ ఏంటంటే.. రణవీర్ సింగ్ తప్పుకున్న తర్వాత మరో హీరో కోసం వెతకడం కంటే ఫర్హాన్ అఖ్తర్ స్వయంగా డాన్ పాత్రను పోషించాలని ఆలోచిస్తున్నట్లు కథనాలొచ్చాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వం వహిస్తూనే మొదటిసారి డాన్ పాత్రలో నటించాల్సి ఉంటుంది.
ఫర్హాన్ హాలీవుడ్ డెబ్యూ..
ఈ గొడవలు ఇలా ఉండగానే ఫర్హాన్ తన హాలీవుడ్ డెబ్యూకు సిద్ధమవుతున్నారు. `బీటిల్స్` బ్యాండ్ మీద తీస్తున్న చిత్రంలో ఆయన లెజెండరీ సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ పాత్రలో నటించబోతున్నారు.
ప్రస్తుతానికి డాన్ 3 ఇప్పుడు డైలమాలో పడింది. ఒకవేళ ఫర్హాన్ అఖ్తర్ స్వయంగా డాన్ పాత్రలో కనిపిస్తే అది ప్రేక్షకులకు ఎంతవరకు నచ్చుతుందో గెస్ చేయడం కష్టం. అమితాబ్, షారూఖ్ లాంటి దిగ్గజ హీరోలను చూసిన అభిమానులు ఫర్హాన్ ని అంగీకరిస్తారా? అన్నది ఒక బిగ్ ఛాలెంజ్. ఈ ప్రాజెక్ట్ గురించి తదుపరి ఫర్హాన్ స్వయంగా అధికారికంగా ప్రకటించాకే ఒక నిర్ధారణకు రావాలి. అప్పటివరకూ ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే.