బాహుబలి చూసైనా మారమంటున్న వర్మ

Update: 2015-07-11 11:21 GMT
బాహుబలి మీద రాజమౌళి మీద.. ఎటు చూసినా ప్రశంసలే బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్లు, హీరోలు, నిర్మాతలు సైతం మనోడిని ఆకాశానికెత్తేస్తున్నారు. ఐతే వీళ్లందరి మాటలు ఒకెత్తయితే.. మన రామ్‌గోపాల్‌ వర్మ వ్యాఖ్యలు మరో ఎత్తు. బాహుబలి సినిమా చూశాకైనా మన హీరోలు మారాలంటూ చురకలంటించాడు వర్మ. మంచి కాన్సెప్ట్‌లకు స్టార్‌ హీరోలు తోడైతే అద్భుతమైన ఫలితాలు వస్తాయని.. కేవలం స్టార్‌ పవర్‌ను మాత్రమే నమ్ముకుంటే ప్రయోజనం లేదని.. హాలీవుడ్‌ ఈ విషయాన్ని ఎప్పుడో గ్రహించిందని.. మన ఇండస్ట్రీలో దానికి బాహుబలి ఉదాహరణ అని వర్మ ట్వీట్‌ చేశాడు.

''బాహుబలి సినిమాతో రాజమౌళి మన ఇండస్ట్రీ మొత్తంలో ఒక న్యూనతా భావాన్ని తీసుకొచ్చాడు. అతడి బాటలో నడిస్తే తప్ప దీనికి చికిత్స దొరకదు. బాహుబలి సినిమా మన స్టార్లందరికీ ఒక మేలుకొలుపు. ఇకనైనా వాళ్లందరూ ఉన్నతంగా ఆలోచించాలి. లేదంటే ఎప్పుడూ కిందే ఉంటారు. ఓ సినిమా అందులో నటించిన స్టార్‌ కంటే మిన్నగా కనిపించడం ఇదే తొలిసారి. శ్రీమంతుడులో మహేష్‌ మాత్రమే ఉన్నాడు. కిక్‌-2 అంటే రవితేజ. కానీ బాహుబలి అలాకాదు. స్టార్‌ను మించిన ఇమేజ్‌ ఆ సినిమాకు వచ్చింది. బాహుబలి తర్వాత వచ్చే పెద్ద సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు కూడా చిన్నవిగా కనిపిస్తాయి. ఎన్ని సినిమాలు వచ్చినా.. బాహుబలి ప్రత్యేకంగా ఉంటుంది. మంచి కాన్సెప్ట్‌లకు స్టార్‌ హీరో పవర్‌ను యాడ్‌ చేసే సినిమాలు రావాలి. హాలీవుడ్‌ ఈ విషయాన్ని ఎప్పుడో గ్రహించింది'' అని వర్మ అన్నాడు.

Tags:    

Similar News