టాలీవుడ్ పై ధురంధర్ 2 ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది?
టాలీవుడ్ లో ఇప్పటికే `బాహుబలి`, `పుష్ప`, `కేజీఎఫ్` వంటి చిత్రాలతో పార్ట్-2 ట్రెండ్‌ను విజయవంతంగా నడు పుతోంది.;
బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ `ధురంధర్ 2` సాధించిన ఘనవిజయం భారతీయ చిత్ర పరిశ్రమలో ముఖ్యంగా టాలీవుడ్‌లో కొత్త చర్చకు తెరలేపుతుందా? అంటే అవుననే అనిపిస్తోంది. ఒక సీక్వెల్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ స్థాయిలో ప్రకంపనలు సృష్టించడం అనేది కేవలం వసూళ్లకే పరిమితం కాకుండా, రాబోయే చిత్రాల కథాంశాలపై కూడా బలమైన ప్రభావాన్ని చూపే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా టాలీవుడ్ దర్శక,నిర్మాతలు ఇప్పుడు ఫ్రాంచైజీ మోడల్ వైపు మరింత సీరియస్‌గా దృష్టి సారించేలా ప్రేరేపిస్తోంది.
టాలీవుడ్ లో ఇప్పటికే `బాహుబలి`, `పుష్ప`, `కేజీఎఫ్` వంటి చిత్రాలతో పార్ట్-2 ట్రెండ్‌ను విజయవంతంగా నడుపుతోంది. అయితే `ధురంధర్ 2` విజయం తో పార్ట్ 3 సంస్కృతి మరింత ఊపందుకునే అవకాశాలున్నాయి. ఒక కథను కేవలం రెండు భాగాలతో ముగించకుండా హాలీవుడ్ తరహాలో ఒక పెద్ద సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేయడంపై మన దర్శకులు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల కథల విస్తృతి పెరగడమే కాదు. ప్రేక్షకులలో ఆయా పాత్రల పట్ల ఉండే ఆసక్తిని దీర్ఘకాలం పాటు కొనసాగించే అవకాశం దక్కతుంది.
భవిష్యత్తులో రాబోయే కథల విషయంలో హై-ఆక్టేన్ స్పై థ్రిల్లర్స్ , ఇంటెలిజెంట్ యాక్షన్ చిత్రాలకు పెద్ద పీట వేసే అవకాశం ఉంది. `ధురంధర్ 2`లో కనిపించిన గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే , టెక్నికల్ స్టాండర్డ్స్ చూశాక, మన హీరోలు కూడా అవే తరహా వైవిధ్యమైన కథల కోసం వెతుకే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా మహేష్ బాబు - రాజమౌళి సినిమా `వారణాసి`, ప్రభాస్ `స్పిరిట్`, ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ వంటి క్రేజీ ప్రాజెక్టులు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కథాంశాలతోనే రూపొందుతున్నాయి. ఇకపై కేవలం మాస్ మసాలా ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా లాజికల్ యాక్షన్ సీక్వెన్స్‌లకు కథల్లో ప్రాధాన్యత పెరగనుంది.
ఆదిత్య దర్ వంటి బాలీవుడ్ దర్శకులు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల వైపు చూడటం కూడా మన మార్కెట్ పరిధిని పెంచే అంశమే. రామ్ చరణ్, ఎన్టీఆర్ , అల్లు అర్జున్ వంటి హీరోలతో ఇలాంటి యాక్షన్ ఫ్రాంచైజీలు పట్టాలెక్కితే, అది గ్లోబల్ మార్కెట్‌లో సరికొత్త రికార్డులకు అవకాశం ఉంటుంది . కథల్లో దేశభక్తి, గూఢచారి వ్యవస్థ ,అంతర్జాతీయ క్రైమ్ వంటి అంశాలను మన నేటివిటీకి జోడించి సరికొత్త కథనాలను ఆవిష్కరించేందుకు టాలీవుడ్ నవతరం రచయితలు సిద్ధమవుతున్నారు.
మొత్తానికి `ధురంధర్ 2` ప్రభావం వల్ల రాబోయే రెండేళ్లలో టాలీవుడ్ నుంచి మరిన్ని భారీ సీక్వెల్స్ , మల్టీ-పార్ట్ చిత్రాలు రానున్నాయి. నిర్మాతలు కూడా భారీ బడ్జెట్ ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు. ఎందుకంటే సరైన కథ ఉంటే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురుస్తుందని `ధురంధర్ 2` మరోసారి నిరూపించింది. ఈ క్రమంలో యువ హీరోలైన నిఖిల్ (స్వయంభూ), అడివి శేష్ (గూడచారి 2) వంటి వారు కూడా అదే బాటలో నడుస్తూ టాలీవుడ్ కీర్తిని విశ్వవ్యాప్తం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.