రామ్ చరణ్ కోసం 264 కిలోమీటర్లు పాదయాత్ర..!

Update: 2022-05-28 11:31 GMT
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోడానికి చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించారు. ఇక చెర్రీ కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉండే మెగా డ్యాన్స్ ఎందరో ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా తమ హీరో మీదున్న అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తుంటారు.

అయితే తాజాగా రామ్ చరణ్ కు ఓ వీరాభిమాని వినూత్నమైన కానుక ఇవ్వడం ఇప్పుడు అంతటా ఆసక్తికరమైన చర్చగా మారింది. గద్వాల్ జిల్లాకు చెందిన జైరాజ్ అనే వ్యక్తి మెగాహీరోలకు డై హార్డ్ ఫ్యాన్. చిన్నతనం నుంచి ఆర్ట్ పట్ల ఆసక్తి పెంచుకున్న అభిమాని.. చరణ్ ఫోటోలను వరి పొలంలో పండించి తన అభిమానాన్ని చాటుకున్నారు.

రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా జైరాజ్ ఈ వరి చిత్రాల్ని పండించాడు. గట్టు మండలం గోర్లఖాన్ దొడ్డి ప్రాంతంలో పొలాన్ని కౌలుకు తీసుకొని వరి నాట్లేసి మరీ ఈ చిత్రాన్ని వేయడం విశేషం. దీని కోసం వేల రూపాయలు ఖర్చు చేశారు. ఎత్తులో నుంచి చూస్తే చెర్రీ ఫోటో స్పష్టంగా కనిపించేలా మూడున్నెలల పాటు శ్రమపడి దీన్ని రెడీ చేసాడు.

తన అభిమాన హీరో బర్త్ డేకి ఏదైనా స్పెషల్ గా అంకితం ఇవ్వాలనే తపనతో జైరాజ్.. చరణ్ వరి చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఈ క్రమంలో తన గ్రామం నుంచి హైదరాబాద్ లోని రామ్ చరణ్ ఇంటి వరకు 264 కిలోమీటర్లు పాదయాత్ర చేసి తన ఫేవరేట్ హీరోని స్వయంగా కలుసుకున్నాడు జైరాజ్.

రామ్ చరణ్ తన వీరాభిమాని గురించి తెలుసుకొని ఈరోజు జైరాజ్ ను తన నివాసానికి పిలిపించుకుని సుమారు 45  నిమిషాలు మాట్లాడారు. జైరాజ్ కళాత్మకంగా రూపొందించిన ఈ ఫొటోలను చెర్రీ కి చూపించి.. వారి గురించి వివరించారు.

తల్లిదండ్రులను కోల్పోయిన జైరాజ్ కు రామ్ చరణ్ ఆర్థిక సహాయం చేసి అండగా ఉంటానని భరోసా కల్పించారు. అంతేకాదు అతని మేధస్సు మెచ్చుకుని సినీ ఇండస్ట్రీలో తగిన స్థానం కల్పిస్తానని మాట ఇచ్చారని తెలుస్తోంది. ఈ సందర్భంగా జైరాజ్ మాట్లాడుతూ తనను గుర్తించి మద్దతుగా నిలిచిన చరణ్ కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు.
Tags:    

Similar News