ఇరకాటంలో చరణ్.. తేజు

Update: 2018-03-18 07:23 GMT
మొహమాటానికి చేశారో.. ప్రేమాభిమానాలతో చేశారో కానీ.. సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ ఇచ్చేశారు రామ్ చరణ్.. సాయిధరమ్ తేజ్. మొన్న గుంటూరు వేదికగా జరిగిన జనసేన ప్లీనరీలో పవన్ ప్రసంగాన్ని పొగిడేస్తూ చరణ్ ఫేస్ బుక్ లో ఒక మెసేజ్ పెట్టాడు. ఆ వైనం చూస్తే కొంచెం మొక్కుబడిగానే మెసేజ్ పెట్టినట్లు అనిపించింది. అందులో వాక్య నిర్మాణం కూడా సరిగా లేకపోయింది. మరోవైపు సాయిధరమ్ తేజ్ ఏమో.. పవన్ ను చేగువేరాతో పోలుస్తూ ఇద్దరూ ప్రసంగిస్తున్న ఫొటోలు పెట్టి పవన్ గురించి గొప్ప గొప్ప మాటలు మాట్లాడేశాడు. ఐతే చేగువేరా ఆశువుగా మాట్లాడేస్తుంటే.. పవన్ ముందు ప్రసంగం పాఠం పెట్టుకుని చదివేస్తున్న వైనంపై జనాలు సెటైర్లు వేశారు. అది వేరే సంగతి.

సోషల్ మీడియాలో మెసేజులు పెట్టడం ఏముంది..? ఎవ్వరైనా చేస్తారు. ఈ మధ్య జనాలు ఏం చేయాలన్నా సోషల్ మీడియానే వేదికవుతోంది. కార్య క్షేత్రంలోకి దిగకుండా అందరూ సోషల్ మీడియాలో గొప్పగా ఉద్యమాలు కూడా చేసేస్తుంటారు. పవన్ సైతం ఎప్పుడూ ట్విట్టర్ ద్వారానే రాజకీయాలు నడుపుతాడన్న విమర్శలు చాన్నాళ్ల నుంచి ఉన్నాయి. ఈ మధ్యే ఆయన బయటికొచ్చి కొంచెం జనాల్లో తిరుగుతున్నాడు. పవన్ సంగతలా ఉంచితే ఆయనకు సోషల్ మీడియా ద్వారా మద్దతు పలికిన చరణ్.. తేజులు రేప్పొద్దున అవసరమైతే ఎన్నికల ప్రచారానికి వస్తారా..? పవన్ కోసం ప్రచారం చేస్తారా..? చిరంజీవి తరఫున అప్పట్లో మెగా ఫ్యామిలీ అంతా కదిలినట్లు పవన్ కోసం కూడా సైన్యం దిగుతుందా..? లేక ఒకసారి అయ్యింది చాల్లే అని సైలెంటుగా ఉంటారా అన్నది చూడాలి. ఏదేమైనా ఇప్పుడు ట్వీటేయడం ద్వారా చరణ్.. తేజు ప్రత్యేకంగా సాధించిందేమీ లేదు. పైగా దీనిపై సెటైర్లే పడుతున్నాయి.


Tags:    

Similar News