డ్రగ్స్ కేసు : ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన రకుల్ ప్రీత్ సింగ్...!

Update: 2020-09-17 09:10 GMT
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి మీడియాలో తనపై వస్తున్న కథనాలు నిలిపివేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ అనుమానస్పద మృతి కేసులో డ్రగ్స్‌ వ్యవహారం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రంగంలోకి దిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సుశాంత్‌ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్సీబీ విచారణలో రియా పలువురు సినీ ప్రముఖుల పేర్లు వెల్లడించిందని.. వారిలో హీరోయిన్స్ రకుల్ ప్రీత్ సింగ్ మరియు సారా అలీఖాన్‌ పేర్లు వెల్లడించినట్లు ఎన్సీబీ అధికారులు చెప్పినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గురించి ప్రసార మాద్యమాల్లో వరుస కథనాలు వెలువడ్డాయి. సోషల్‌ మీడియాలో సైతం రకుల్‌ కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ విపరీతంగా ట్రోల్ చేశారు.

ఈ నేపథ్యంలో రకుల్‌ ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి.. మాదకద్రవ్యాల కేసుకు సంబంధించి మీడియాలో తనపై వస్తున్న కథనాలు నిలిపివేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వార్తలను మీడియాలో ప్రసారం చేయకుండా సమాచారశాఖకు ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నారు. రకుల్‌ పిటిషన్‌ ను విచారణకు స్వీకరించిన జస్టిస్‌ చావ్లా ధర్మాసనం.. మీడియాలో ప్రసారాలపై సుప్రీంకోర్టు ఇప్పటికే స్పందించిందని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా దిల్లీ హైకోర్టు.. మీడియా సంస్థలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచిస్తూ పిటిషన్‌ ను ఫిర్యాదుగా పరిగణించి ఆయా శాఖలు చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. ఈమేరకు సమాచారశాఖ - ప్రసారశాఖ - ప్రసార భారతి - ఎన్‌బీఏ - ప్రెస్‌ కౌన్సిల్‌ కు హైకోర్టు నోటీసులు జారీ చేసిందని తెలుస్తోంది.
Tags:    

Similar News