రజినీ వస్తున్నాడహో.. సందడి షురూ
సూపర్ స్టార్ రజినీకాంత్ చాలా రోజులుగా అమెరికాలోనే ఉన్నారు. కొన్ని హెల్త్ చెకప్ ల కోసం యూఎస్ వెళ్లిన ఆయన ఆరోగ్యంపై చాలానే రూమర్స్ వినిపించాయి. అక్కడి నుంచి స్టేటస్ పై న్యూస్ రాకపోవడంతో.. ఈ రూమర్లు మరింత ఎక్కువయ్యాయి. కబాలి ఆడియో ఫంక్షన్స్ - ప్రచారంలో కూడా సూపర్ స్టార్ కనిపించకపోవడంతో వీటికి మరింత ఆజ్యం పోసినట్లైంది. రజినీ ఎప్పుడొస్తాడా అని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూసే పరిస్థితి.
అభిమానులు ఎదురుచూస్తున్న ఆ క్షణం జూలై 20న రానుంది. ఆ రోజుకి రజినీకాంత్ ఇండియాలో అడుగుపెట్టనున్నారు. సరిగ్గా కబాలి విడుదలకు 2 రోజుల ముందు ఆయన ఇండియాలో పాదం మోపుతారు. వచ్చీ రాగానే ఒకటి రెండు ప్రెస్ మీట్స్ నిర్వహించి పబ్లిసిటీ చేయనున్నారని తెలుస్తోంది. ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ప్రచార కార్యక్రమాలు ముగించేలా ప్లాన్ చేశారట. ఆయన గురించి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులకు.. రజినీ నోట వెంట ఒక్క మాట వచ్చినా చాలు. అదే బోలెడంత పబ్లిసిటీ ఇస్తుందనే విషయం వేరే చెప్పాల్సిన పని లేదు.
మరోవైపు రజినీ సందడి తమిళనాడులో మామూలుగా లేదు. ఇప్పటికే రజినీకాంత్ పేరిట ఎక్స్ క్లూజివ్ గా రెస్టారెంట్లను ఏర్పాటు చేసి అంకితం ఇచ్చేస్తున్నారు. ఇక ఫ్యాన్స్ అసోసియేషన్ లయితే.. ప్రత్యేక అభిషేకాలు.. పూజలతో నానా హంగామా చేసేందుకు సిద్ధమని చెప్పేస్తున్నారు. బ్లూ - రెడ్ కలర్ బోర్డర్ లు ఉన్న ధోవతిలు ధరించడం రజినీ స్టైల్. ఇప్పటికే తమిళనాట చాలా షాపుల్లో ఇవి దర్శనమిస్తున్నాయి.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. చూస్తుంటే రెండేళ్ల తర్వాత కబాలితో మాంచి కిక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.