ప్ర‌ఖ్యాత చిత్ర‌కారుడు ర‌వివ‌ర్మ బొమ్మ‌లు ఎలా వేశాడంటే?

Update: 2021-04-29 07:00 GMT
‘రవివర్మ గీసిన చిత్రమట..’ అని పాడుకోవడం కొందరికి తెలుసు. ర‌వివ‌ర్మ‌ ఒక ప్ర‌ఖ్యాత చిత్ర‌కారుడు అని మ‌రికొంద‌రికి తెలుసు.. కానీ, ఆయ‌న కుంచెకు అంత శ‌క్తి ఎక్క‌డిది? అన్న ప్ర‌శ్న‌కు జ‌వాబు చాలా మందికి తెలియ‌దు. స్వ‌త‌హాగా వ‌చ్చిందా? ఎవ‌రి వ‌ద్ద‌నైనా నేర్చుకున్నాడా? అనే విష‌యాలు కూడా పెద్ద‌గా తెలియ‌దు. సో.. ప్ర‌పంచం గ‌ర్వించ ద‌గిన చిత్ర‌కారుడి గురించి తెలుసుకోవాల‌ని అనుకుంటే.. ఈ క‌థ‌నంలోకి వెళ్లాల్సిందే.

వంద భావాల‌ను.. వేయి ఆలోచ‌న‌ల‌ను ఒక్క చిత్రంతో చెప్పొచ్చు. ఒక ప్ర‌సంగం ద్వారా చెప్పాల‌నుకున్న సారాంశం మొత్తాన్ని.. ఒక బొమ్మ ద్వారా వివ‌రించొచ్చు. అదీ.. చిత్ర‌లేఖ‌నానికి ఉన్న కెపాసిటీ! అలాంటి చిత్రాల‌ను అల‌వోక‌గా గీస్తూ.. ప్ర‌పంచంలోనే మేటి ఆర్టిస్టుగా గుర్తింపు పొందారు ర‌వి వ‌ర్మ‌. అందుకే.. ఆయ‌న పేరు చిర‌స్థాయిగా నిలిచిపోయింది. ఎంద‌రికో మార్గ‌ద‌ర్శిగా నిలుస్తోంది.

ర‌వి వ‌ర్మ జీవితం గురించి తెలుసుకుంటే.. ఆయ‌నొక మ‌ల‌యాళీ. 1848లో కేర‌ళ‌లో జ‌న్మించారు. ఆయ‌న‌ ఏడు సంవ‌త్స‌రాలకే కుంచె ప‌ట్టుకోవ‌డం మొద‌లు పెట్టారు. నిత్యం చూసే దృశ్యాల‌ను, స‌న్నివేశాల‌ను చిత్రాలుగా మ‌లిచేవాడు. ఆయ‌న ప్ర‌తిభ గురించి తెలుసుకున్న ట్రావెన్ కోర్ మ‌హారాజు.. ఆస్థానానికి పిలిపించుకున్నాడు. అక్క‌డ ఆస్థాన చిత్ర‌కారుడు రామ‌స్వామి వ‌ద్ద శిష్యుడిగా చేరారు. ఆ త‌ర్వాత బ్రిటీష్ ఆర్టిస్టు థియోడార్ జెన్సన్ వ‌ద్ద ఆయిల్ పెయింటింగ్ నేర్చుకున్నాడు.

భార‌త‌దేశంలో మొట్ట‌మొద‌టి సారిగా ఆయిల్ పెయింటింగ్ వేసిన ఆర్టిస్టు ర‌వివ‌ర్మ కావ‌డం విశేషం. భార‌తీయ సంప్ర‌దాయ చిత్ర‌క‌ళ‌కు వెస్ట్ర‌న్ క‌ల్చ‌ర్ ను జోడించి బొమ్మ‌లు వేయ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. ఆ విధంగా ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ర‌వివ‌ర్మ‌.. 1873లో జ‌రిగిన డ్రాయింగ్ కాంపిటేష‌న్ లో మొద‌టి బ‌హుమ‌తి గెలుచుకొని అబ్బుర‌ప‌రిచారు.

దేశ‌, విదేశాల్లో ఆయ‌న చిత్రాల‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అలాంటి ర‌వివ‌ర్మ 1906లో అనారోగ్యంతో క‌న్నుమూశారు. ఆయ‌న మ‌ర‌ణించే నాటికి దాదాపు 7వేల పెయింటింగ్స్ గీసిన‌ట్టు అంచ‌నా. అందులోని చాలా బొమ్మ‌లు.. కేర‌ళ రాజ‌ధాని తిరువ‌నంత‌పురంలోని చిత్ర ఆర్ట్ గ్యాల‌రీలో ఉంచారు.

ఇప్ప‌టి వ‌ర‌కూ వెలుగులోకి వ‌చ్చిన ఎంతో మంది చిత్ర‌కారుల‌కు.. భ‌విష్య‌త్ లో రాబోయే వారికి ర‌వివ‌ర్మ ఒక స్ఫూర్తి అని చెప్ప‌డంలో సందేహం లేదు. దేశంలో అగ్ర చిత్ర‌కారుడిగా వెలుగొందిన ర‌వివ‌ర్మ.. చ‌రిత్ర‌లో శాశ్వ‌తం స్థానం సంపాదించుకున్నారు.
Tags:    

Similar News