`పుష్ప` మొదటి రోజు వసూళ్ల వివరం
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన `పుష్ప -దిరైజ్` శుక్రవారం వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. అయినా బన్నీ ఇమేజ్ తో హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్నింగ్ లో ఉంది. తాజాగా ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ 40 కోట్లు వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తెలుగు రాష్ట్రాల నుంచి 30 కోట్లు రాబట్టగా.. హిందీ..మలయాళం..కన్నడ భాషల నుంచి 5 కోట్లు.. విదేశాల నుంచి మరో 5 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు తేలింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా కొన్ని ఏరియాల నుంచి ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోయిందని తెలుస్తోంది.
హిందీ నుంచి భారీ కలెక్షన్స్ ఉంటాయని భావించినా ఆ సీన్ ఎక్కడా కనిపించలేదు. మొదటి రోజు నార్త్ లో పుష్ప థియేటర్లు వెలవెలబోయాయి. కనీసం 10 శాతం ఆక్యుపెన్సీ కూడా లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది బన్నీకి హిందీలో డెబ్యూ మూవీ. ఉత్తరాది ప్రేక్షకులకు బన్నీ అంతగా కనెక్ట్ కాలేదు. ఆ కారణంగాను సినిమాపై ఎఫెక్ట్ పడింది. అయితే కన్నడలో బన్నీకి మంచి ఫాలోయింగ్ ఉంది.
కానీ అక్కడా `పుష్ప` అంచనాల్ని అందుకోలేకపోయింది. ఆ రెండు ఏరియాల నుంచి వసూళ్లు బాగుంటే మొదటి రోజు 50 కోట్లకు పైగానే తెచ్చేదని సమాచారం. దీన్ని బట్టి పుష్ప ఎలాంటి రికార్డులు చేధించాలన్నా కేవలం తెలుగు మార్కెట్ ఒక్కటే ఇప్పుడు కీలకం అని తెలుస్తోంది.
ప్రస్తుతానికి పోటీగా ఏ సినిమాలు లేవు కాబట్టి నెమ్మదిగా వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. ఇక అమెరికాలో `పుష్ప`కి ఆదరణ బాగానే ఉంది. త్వరలోనే వన్ మిలియిన్ మార్క్ ని క్రాస్ చేస్తుందని అంచనాలున్నాయి. అదే జరిగితే అమెరికాలో వన్ మిలియన్ మార్క్ ని క్రాస్ చేసిన బన్నీ ఐదవ చిత్రంగా `పుష్ప` రికార్డుకి ఎక్కుతుంది. ప్రీమియర్ షో ల నుంచి 531 కె డాలర్లు వసూళ్లను సాధించగా...శుక్రవారం 340 కె డాలర్ల వసూళ్లను సాధించింది. దీంతో `పుష్ప` వన్ మిలియన్ మార్క్ కి అతి చేరువలోకి చేరుకుంది.
గతంలో బన్నీ నటించిన ` అలవైకుంఠపురములో`..`దువ్వాడ జగన్నాధం`.. `సన్ ఆఫ్ సత్యమూర్తి`... `రేసు గుర్రం` లాంటి సినిమాలే ఇప్పటివరకూ వన్ మిలియన్ కి పైగా వసూళ్లు సాధించాయి.
ఏపీ పెద్ద మైనస్..!
నిజానికి ఏపీలో టిక్కెట్టు ధరల సవరణపై సరైన క్లారిటీ లేకపోవడంతో పుష్ప కలెక్షన్స్ ఆశించిన మేరకు రీచ్ కాలేదని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పాత ధరలతో టిక్కెట్లు అమ్మాలని కలెక్టర్ల నుంచి ఇంకా అనుమతులు లభించలేదు.
ఇక టిక్కెట్టు ధరల్ని పెంచుకోవచ్చని ఇప్పటికే కోర్టు తీర్పు వెలువరించినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని గుసగుసలు వినిపించాయి. తెలంగాణలో మాత్రం రూ.250వరకూ టిక్కెట్టు ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించడం ఆసక్తికరం. ఒక చోట ప్రోత్సాహం ఉన్నా మరో చోట ప్రోత్సాహం లేదన్న విమర్శలొచ్చాయి.