పెళ్లి వివాదంపై ప్రియ‌మ‌ణి కీలక వ్యాఖ్యలు

Update: 2021-07-23 02:30 GMT
సినీ హీరోయిన్ ప్రియమణి పెళ్లి విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. త‌న భ‌ర్త నుంచి తాను చ‌ట్ట‌బ‌ద్ధంగా విడిపోలేద‌ని, కాబ‌ట్టి.. త‌న భ‌ర్త‌ను ప్రియ‌మ‌ణి చేసుకున్న వివాహం చెల్ల‌దంటూ ముస్త‌ఫారాజ్ మొద‌టి భార్య వ్యాఖ్యానించ‌డం సంచ‌ల‌నం రేకెత్తించింది. ఈ విష‌యం మీడియాలో, సోష‌ల్ మీడియాలో హాట్ డిస్క‌ష‌న్ గా మారింది. ఈ నేప‌థ్యంలో ఈ అంశంపై స్పందించిన ప్రియ‌మ‌ణి కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

ప్రియ‌మ‌ణి, వ్యాపార‌వేత్త‌గా ఉన్న ముస్తఫారాజ్ 2017లో పెళ్లి చేసుకున్నారు. అయితే.. ముస్త‌ఫాకు అంత‌కు ముందే పెళ్ల‌య్యింది. ఆయేషా అనే యువ‌తిని ముస్త‌ఫా పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు కూడా క‌లిగారు. ఆ త‌ర్వాత కాలంలో ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో 2010 నుంచి విడిగా ఉంటున్నారు. ఈ క్ర‌మంలోనే 2017లో ప్రియ‌మ‌ణిని ముస్త‌ఫారాజ్ రెండో పెళ్లి చేసుకున్నారు.

అయితే.. కొన్ని రోజులుగా ముస్త‌ఫా మొద‌టి భార్య వీరిపెళ్లిపై బ‌హిరంగంగా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. తాము ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం విడాకుల‌కు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోలేదని, అందువ‌ల్ల ప్రియ‌మ‌ణి-ముస్త‌ఫా వివాహం చెల్ల‌ద‌ని వాదిస్తోంది. ప్రియ‌మ‌ణిని పెళ్లి చేసుకున్న‌ప్ప‌టి నుంచీ ముస్తాఫా త‌న‌ను, త‌న పిల్ల‌ల‌ను ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని చెబుతోంది.

ఈ విష‌య‌మై ప్రియ‌మ‌ణి తాజాగా స్పందించింది. త‌మ వివాహంపై వ‌స్తున్నవ‌న్నీ పుకార్లేన‌ని తేల్చి చెప్పింది. ప్ర‌స్తుతం త‌న భ‌ర్త ముస్త‌ఫా విదేశాల్లో ఉన్నార‌ని, ఆయ‌న దొర‌క‌డం త‌న అదృష్ట‌మ‌ని చెప్పుకొచ్చింది. త‌మ బంధం గురించ ఎవ‌రెవ‌రో ఏదో మాట్లాడుతున్నార‌న్న ప్రియ‌మ‌ణి.. తాము ఎంతో అన్యోన్యంగా ఉన్నామ‌ని, త‌మ మ‌ధ్య ఎలాంటి మ‌నస్ప‌ర్థ‌లూ లేవ‌ని చెప్పింది. ఇక‌, త‌మ‌ది చ‌ట్ట విరుద్ధ‌మైన బంధం కాద‌ని, త‌మ బాంధ‌వ్యానికి వ‌చ్చిన ప్ర‌మాదం ఏదీ లేద‌ని చెప్పింది.

అటు ముస్త‌ఫా రాజ్ కూడా ఈ విష‌య‌మై మాట్లాడారు. ఈ విష‌యంలో ఆయేషా మాట్లాడుతున్న‌వ‌న్నీ అవాస్త‌వాలేన‌ని చెప్పారు. తాను పిల్ల‌ల సంరక్ష‌ణ కోసం ప్ర‌తినెలా డ‌బ్బులు పంపిస్తూనే ఉన్న‌ట్టు చెప్పాడు. అది వాస్త‌వం కాక‌పోతే.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆమె ఎందుకు మౌనంగా ఉంటుంద‌ని ప్ర‌శ్నించాడు. డ‌బ్బుల కోస‌మే ఆమె ఇలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపించారు. మ‌రి, వీరి స్పంద‌న‌పై ఆయేషా ఏమంటుందో చూడాలి.
Tags:    

Similar News