మా నాన్న గ్యాంగ్ స్ట‌ర్ కాదు.. క్రిమిన‌ల్ కాదు.. స్టార్ హీరోకి కొత్త చిక్కులు!

ఈ సినిమాలో షాహిద్ కపూర్ హుస్సేన్ ఉస్తారాగా న‌టిస్తుంటే, తృప్తి దిమ్రి సప్నా దీదీగా న‌టిస్తోంది. వారి మధ్య రొమాంటిక్ యాంగిల్‌ను చూపిస్తున్నట్లు టీజర్, పాటల ద్వారా తెలుస్తోంది.;

Update: 2026-01-21 03:28 GMT

షాహిద్ కపూర్ ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తున్న తాజా చిత్రం `ఓ రోమియో` ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. ముంబైకి చెందిన దివంగత వ్యక్తి హుస్సేన్ ఉస్తారా కుమార్తె సనోబర్ షేక్ ఈ చిత్ర నిర్మాతలు తన తండ్రి జీవితాన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ మండిపడ్డారు. హుస్సేన్ ఉస్తారాను ఈ సినిమాలో ఒక నెగటివ్ గ్యాంగ్‌స్టర్‌గా చూపిస్తున్నారని సనోబర్ ఆవేదన వ్యక్తం చేశారు.

మా నాన్న గ్యాంగ్‌స్టర్ కాదు. ఆయన ముంబై నగరాన్ని నేరాల నుండి క్లీన్ చేయడానికి పోలీసులకు సహాయం చేసేవారు. గ్యాంగ్‌స్టర్ సంస్కృతిని అంతం చేయడానికి ఆయన పోరాడారు. కానీ గూగుల్‌లో ఇప్పుడు ఆయన పేరు వెతికితే ప్రొఫెషనల్ కిల్లర్ అని వస్తోంది. ఇది మమ్మల్ని చాలా బాధపెడుతోంది! అని ఆమె పేర్కొన్నారు.

ఈ సినిమాలో షాహిద్ కపూర్ హుస్సేన్ ఉస్తారాగా న‌టిస్తుంటే, తృప్తి దిమ్రి సప్నా దీదీగా న‌టిస్తోంది. వారి మధ్య రొమాంటిక్ యాంగిల్‌ను చూపిస్తున్నట్లు టీజర్, పాటల ద్వారా తెలుస్తోంది. దీనిపై సనోబర్ తీవ్రంగా స్పందించారు. స‌ప్నా దీదీ మా నాన్నకు సోదరి వంటిది. ఆమె భర్త చనిపోయి ఒంటరిగా ఉన్నప్పుడు మా నాన్నే ఆమెకు అండగా నిలిచారు.. శిక్షణ ఇచ్చారు. ఆమె మా ఇంటికి, ఆఫీసుకి వస్తుండేది. కానీ సినిమాలో వారి మధ్య ప్రేమ ఉన్నట్లు చూపించడం కేవలం కల్పితం.. పెద్ద‌ తప్పు! అని ఆమె ఆవేద‌న చెందారు.

సనోబర్ `ఓ రోమియో` చిత్ర దర్శకుడు విశాల్ భరద్వాజ్, నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలాలకు లీగల్ నోటీసులు పంపారు. అనుమతి లేకుండా తన తండ్రి పోలికలను, కథను వాడుకున్నందుకు గాను రూ. 2 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేశారు. సినిమా విడుదలయ్యే లోపు తమ కుటుంబానికి ఒకసారి చూపించాలని, తాము గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే విడుదల చేయాలని కోరారు.

తాము చిత్ర యూనిట్‌ను బెదిరించామని వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. తాము కేవలం చట్టపరమైన పోరాటం మాత్రమే చేస్తున్నామని తెలిపారు. ఓ రోమియో చిత్రం హుస్సేన్ ఎస్. జైదీ రాసిన `మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై` పుస్తకం ఆధారంగా రూపొందుతున్నట్లు సమాచారం. ఈ సినిమా ఫిబ్రవరి 13న వాలెంటైన్స్ డేకి ఒక రోజు ముందు విడుదల కావాల్సి ఉంది. ప్ర‌స్తుతం ఇది కోర్టు చిక్కుల నుంచి బ‌య‌ట‌ప‌డాల్సి ఉంటుంది.

మొత్తానికి వాస్తవ సంఘటనల ఆధారంగా తీసే సినిమాల్లో ``సినిమాటిక్ లిబర్టీ- కల్పిత సన్నివేశాలు`` పేరుతో నిజ జీవిత వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించ‌డం స‌రైన‌దేనా? అనే చర్చ మళ్ళీ మొదలైంది. ఈ సినిమాపై ప్ర‌స్తుతం కోర్టు కేసులు న‌డుస్తున్నాయి. న్యాయ‌స్థానాలు ఇరు వ‌ర్గాల‌లో ఎవ‌రికి అనుకూలంగా తీర్పునిస్తాయో వేచి చూడాలి.

Tags:    

Similar News