సంక్రాంతి బాక్సాఫీస్ రిజల్ట్.. ఓ పాఠం నేర్పిన ప్రేక్షకులు!
ప్రతి ఏటా సంక్రాంతి సీజన్ టాలీవుడ్‌లో ఎలాంటి వాతావరణం కనిపిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.;
ప్రతి ఏటా సంక్రాంతి సీజన్ టాలీవుడ్‌లో ఎలాంటి వాతావరణం కనిపిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈసారి మూడు మీడియం రేంజ్ సినిమాల కంటే ఇద్దరు టాప్ హీరోల రిజల్ట్ కొంత హీట్ ని పెంచాయి. సంక్రాంతి బరిలో ఇద్దరు దిగ్గజ హీరోలు ప్రభాస్, చిరంజీవి తమ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ (MSG) ఒకవైపు, ప్రభాస్-మారుతి కలయికలో వచ్చిన ‘ది రాజా సాబ్’ మరోవైపు థియేటర్లలో సందడి చేశాయి. అయితే ఈ రెండు సినిమాల ఫలితాలు ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్‌కు ఒక పాఠాన్ని నేర్పించాయి.
ఈ పండుగ సీజన్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి తన బలాన్ని నమ్ముకుని, ఆడియన్స్‌కు ఏం కావాలో అదే ఇచ్చారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను అందించి మెగాస్టార్‌లోని పాత వింటేజ్ కామెడీని మళ్ళీ బయటకు తీశారు. పక్కా ప్లానింగ్‌తో, ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ అనిల్ చేసిన ఈ ప్రయోగం అదిరిపోయే రిజల్ట్ ఇచ్చింది. కేవలం వారం రోజుల్లోనే ఈ సినిమా 300 కోట్ల గ్రాస్ వసూళ్ల దిశగా దూసుకుపోతూ బాక్సాఫీస్ విన్నర్‌గా నిలిచింది.
మరోవైపు ‘ది రాజా సాబ్’ విషయంలో డైరెక్టర్ మారుతి కొంచెం కన్ఫ్యూజ్ అయినట్లు కనిపిస్తోంది. నిజానికి మారుతికి హారర్ కామెడీలో మంచి పట్టు ఉంది, కానీ ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ కోసం ఆయన కథను భారీ లెవల్లో మార్చే ప్రయత్నం చేశారు. సింపుల్ హారర్ కామెడీగా ఉండాల్సిన సినిమాను భారీ బడ్జెట్ హారర్ ఫాంటసీగా మార్చడంతో కథలో క్లారిటీ మిస్ అయిందనే టాక్ వినిపిస్తోంది. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ పై ఎక్కువ ఫోకస్ పెట్టి సోల్ మిస్ అవ్వడం వల్లే ఆడియన్స్ నుంచి మిక్స్ డ్ టాక్ వచ్చింది.
ప్రభాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని మారుతి చేసిన ప్రయోగాలు సరిగ్గా వర్కవుట్ కాలేదు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోయినా, కంటెంట్ వీక్ గా ఉండటంతో రెండో వారం నుంచి వసూళ్లు పడిపోయాయి. దర్శకుడు తన మార్క్ కామెడీని వదిలి, ట్రెండ్ కోసం కొత్త జోనర్లను మిక్స్ చేయడమే ఈ సినిమాకు మైనస్ అయ్యింది. అనిల్ రావిపూడి లాగా తన బలాన్ని నమ్ముకుని ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఏదేమైనా ఈ సంక్రాంతి ఇచ్చిన మెసేజ్ ఒక్కటే.. దర్శకులు తమ బలాన్ని వదిలి పక్కవారిని లేదా ట్రెండ్‌ను అనుకరిస్తే దెబ్బతినక తప్పదు. ఆడియన్స్‌కు క్లారిటీ ఉన్న కథను, నమ్మకంతో చెబితే తప్పకుండా ఆదరిస్తారు. తన స్టైల్ లోనే సినిమా తీసిన అనిల్ హిట్ కొడితే, కొత్తగా ట్రై చేద్దామని కన్ఫ్యూజ్ అయిన మారుతికి నిరాశే మిగిలింది. మేకర్స్ ఇప్పటికైనా ఆడియన్స్ పల్స్ తెలుసుకుని సినిమాలు తీయాలని ఈ సంక్రాంతి ఫలితాలు నిరూపించాయి.