రుణం తీర్చుకునే పనిలో పడ్డ ప్రభాస్‌

Update: 2020-08-15 05:30 GMT
ప్రభాస్‌ సినీ కెరీర్‌ లో మొదటి బిగ్గెస్ట్‌ సక్సెస్‌ ఏంటీ అంటే అందరు చెప్పే సినిమా పేరు వర్షం. ఆ సినిమాతో ప్రభాస్‌ క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగి పోయింది. ఆయన ఇమేజ్‌ కూడా మారిపోయింది. వర్షం సినిమాతో స్టార్‌ హీరోల జాబితాలో ప్రభాస్‌ చేరిపోయాడు. అంతటి సూపర్‌ హిట్‌ పడటం వల్లే ప్రస్తుతం తనకు ఈ స్థాయి అని ప్రభాస్‌ భావిస్తూ ఉన్నట్లున్నాడు. అందుకే వర్షం చిత్ర దర్శకుడు తనకు చేసిన దానికి రుణం తీర్చుకోవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

వర్షం చిత్రానికి దివంగత దర్శకుడు శోభన్‌ దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. ఆయన తనయుడు సంతోష్‌ శోభన్‌ హీరోగా పరిచయం అయ్యాడు. ఆయన మొదటి సినిమాను మహేష్‌ బాబు ప్రభాస్‌ లతో పాటు పలువురు ప్రమోట్‌ చేశారు. కాని ఆ సినిమా ఆశించిన స్థాయిలో సంతోష్‌ కు గుర్తింపు తీసుకు రాలేదు. ఒక్క సారి సాయం చేసి వదిలేస్తే ప్రభాస్‌ ఎలా అవుతాడు. ఎలా అయినా సంతోష్‌ ను హీరోగా నిలబెట్టాలని నటుడిగా మంచి పేరు తెచ్చుకునేలా చేయాలని భావించినట్లుగా ఉన్నాడు. అందుకే సంతోష్‌ కెరీర్‌ బాధ్యతలను తీసుకున్నాడు.

తన హోం బ్యానర్‌ అయిన యూవీ క్రియేషన్స్‌ లో సంతోష్‌ తో సినిమా చేయిస్తున్నాడు. ఒక మంచి కథను తానే స్వయంగా ఎంపిక చేశాడట. ప్రస్తుతం అందుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. మీడియం బడ్జెట్‌ తో సినిమాను తెరకెక్కించబోతున్నారు. సినిమా పూర్తి అయ్యే వరకు థియేటర్లు ఓపెన్‌ అయితే థియేటర్లలో లేదంటే ఓటీటీలో విడుదలకు అయినా సిద్దం అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు. వరుసగా సంతోష్‌ శోభన్‌ తో సినిమాలు చేసి అతడిని హీరోగా నిలబెట్టి తనకు వర్షం వంటి బిగ్గెస్ట్‌ హిట్‌ ఇచ్చిన శోభన్‌ రుణం తీర్చుకోవాలని ప్రభాస్‌ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News