ఆస్కార్ చరిత్రలోనే ఫస్ట్ మూవీ.. మన శేష్ కు నచ్చలేదా?
భారీ అంచనాలతో, రికార్డు స్థాయిలో నామినేషన్లతో చర్చల్లో నిలిచిన ఆ సినిమా గురించి అడివి శేష్ చెప్పిన అభిప్రాయం చర్చనీయాంశమైంది. అసలేం జరిగిందంటే?;
ఆస్కార్ రేసులో రీసెంట్ గా సంచలనం సృష్టించిన సిన్నర్స్ సినిమాపై టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. భారీ అంచనాలతో, రికార్డు స్థాయిలో నామినేషన్లతో చర్చల్లో నిలిచిన ఆ సినిమా గురించి అడివి శేష్ చెప్పిన అభిప్రాయం చర్చనీయాంశమైంది. అసలేం జరిగిందంటే?
ర్యాన్ కూగ్లర్ దర్శకత్వంలో తెరకెక్కిన సిన్నర్స్ చిత్రం ఆస్కార్ అవార్డ్స్ లో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ ఎడిటింగ్, ప్రొడక్షన్ డిజైన్ వంటి ప్రధాన విభాగాలతో కలిపి మొత్తం 16 నామినేషన్లు దక్కించుకుని ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇంతకుముందు 14 నామినేషన్లతో ఉన్న సినిమాల రికార్డును ఈ చిత్రం అధిగమించడం విశేషం.
దీంతో ఆస్కార్ చరిత్రలో అత్యధిక నామినేషన్లు సాధించిన తొలి చిత్రంగా సిన్నర్స్ నిలిచింది. హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఆ సినిమాలో ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ బి జోర్డాన్ ప్రధాన పాత్ర పోషించారు. స్మోక్, స్టాక్ అనే కవల సోదరుల జీవితాల చుట్టూ తిరిగే కథలో థ్రిల్లింగ్ ట్విస్టులు, సస్పెన్స్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ కారణంగానే సినిమా అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అయితే ఆ చిత్రంపై అడివి శేష్ భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. తన రాబోయే చిత్రం డెకాయిట్ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడిన ఆయనకు సిన్నర్స్ అంతగా నచ్చలేదని స్పష్టం చేశారు. ఆ సినిమా ద్వారా దర్శకుడు ఏం చెప్పాలనుకున్నారో తనకు స్పష్టంగా అర్థం కాలేదని తెలిపారు. ఇది వాంపైర్ స్టోరీనా, లేక జాతి వివక్షపై కామెంటా, లేదా నల్లజాతిపై ఏదైనా సందేశమా అన్నది కన్ఫ్యూజ్ గా అనిపించిందని చెప్పారు.
అందుకే ఒక ప్రేక్షకుడిగా తనకు సినిమా పెద్దగా కనెక్ట్ కాలేదని శేష్ వివరించారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఆయన అభిప్రాయాన్ని సమర్థిస్తూ ప్రతి ప్రేక్షకుడికి తన తన అభిరుచి ఉంటుందని అంటుండగా, మరికొందరు మాత్రం ఆస్కార్ స్థాయి చిత్రంపై ఇలా కామెంట్ చేయడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు.
మరికొందరు అయితే సినిమాను అర్థం చేసుకునే విధానం వ్యక్తిగతమని, అందుకే ఇలాంటి భిన్నాభిప్రాయాలు సహజమని చెబుతున్నారు. మొత్తానికి, ఒకవైపు రికార్డు స్థాయి నామినేషన్లతో సిన్నర్స్ సినిమా చరిత్ర సృష్టించగా.. మరోవైపు అదే చిత్రంపై వచ్చిన విమర్శలు కూడా ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. సినిమా విజయం, విమర్శలు.. రెండూ కూడా ప్రేక్షకుల అభిరుచులపై ఆధారపడతాయని ఈ ఘటన మరోసారి క్లారిటీ ఇచ్చింది.