ఎట్ట‌కేల‌కు సీక్వెల్ కు తొలి అడుగు!

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన క్లాసిక్ చిత్రం `క్వీన్`. కంగనా రనౌత్ నటన, వికాస్ బహల్ దర్శకత్వ ప్రతిభ సినిమాను ఒక కల్ట్ ఫేవరెట్‌గా నిలబెట్టాయి.;

Update: 2026-04-04 09:20 GMT

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన క్లాసిక్ చిత్రం `క్వీన్`. కంగనా రనౌత్ నటన, వికాస్ బహల్ దర్శకత్వ ప్రతిభ సినిమాను ఒక కల్ట్ ఫేవరెట్‌గా నిలబెట్టాయి. అయితే గత పదేళ్లుగా ఈ చిత్రానికి సీక్వెల్ వస్తుందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇంత వ‌ర‌కూ కార్యరూపం దాల్చలేదు. తాజాగా సినీ ప్రియులకు తీపి కబురు అందిస్తూ దర్శకుడు వికాస్ బహల్ ప్రతిష్టాత్మక సీక్వెల్ కోసం సన్నాహాలు మొదలుపెట్టారు. ఈసారి `క్వీన్` సీక్వెల్ కథాంశం చాలా భిన్నంగా ఆసక్తికరంగా ఉండబోతోంది. మొదటి భాగంలో విదేశీ పర్యటన ద్వారా తనను తాను అన్వేషించుకున్న రాణి పాత్ర ఈ సీక్వెల్‌లో భారతదేశంలోని విభిన్న సంస్కృతులను, మెట్రో నగరాల జీవనశైలిని పరిచయం చేయబోతోంది.

కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా? భారత్ వినువీధుల్లో రాణి చేసే ప్రయాణం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ముంబైతో పాటు దేశంలోని అన్ని ప్రధాన మెట్రో నగరాల్లో ఈ సినిమా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లోని ఆధునిక జీవన విధానం, అక్కడి మహిళల ఎదుగుదల , రాణి ఎదుర్కొనే కొత్త సవాళ్లను ఈ కథలో చూపించబోతున్నారు. ఒక మధ్యతరగతి అమ్మాయి మెట్రో నగరాల వేగవంతమైన జీవితంలో ఎలా ఇమడగలిగింది అనే కోణంలో వికాస్ బహల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

సినిమా నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే ప్రాథమిక పనులు పూర్తయ్యాయని సమాచారం. స్క్రిప్ట్ వర్క్ దాదాపు ముగింపు దశకు చేరుకోవడంతో నటీనటుల ఎంపికపై చిత్ర యూనిట్ దృష్టి సారించింది. కంగనా రనౌత్ మళ్ళీ రాణి పాత్రలో కనిపిస్తుందా లేదా అనే దానిపై అధికారిక ప్రకటన రానప్పటికీ ఆమె ఉంటేనే ఈ సీక్వెల్‌కు పరిపూర్ణత వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. దర్శకుడు కూడా ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మొదటి భాగం మహిళా సాధికారతకు, ఆత్మవిశ్వాసానికి నిలువుటద్దంగా నిలిచింది. తాజాగా రాబోతున్న సీక్వెల్ కూడా అదే స్థాయి ఎమోషన్స్ ,వినోదాన్ని అందిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాలక్రమేణా మారుతున్న సమాజం, పెరిగిన టెక్నాలజీ ,ఆధునిక ఆలోచనల నేపథ్యంలో రాణి పాత్రను మరింత శక్తివంతంగా ఆవిష్కరించబోతున్నారు. ఇది కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు. ఒక కొత్త అనుభూతిని ఇచ్చే చిత్రమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎట్టకేలకు `క్వీన్` సీక్వెల్‌కు తొలి అడుగు పడటం బాలీవుడ్‌లో ఒక సానుకూల పరిణామం. పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూనే సరికొత్త కథనంతో రాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మళ్ళీ మ్యాజిక్ చేస్తుందని అభిమానులు ఆశీస్తున్నారు. వికాస్ బహల్ మేకింగ్ స్టైల్ , రాణి పాత్రలోని అమాయకత్వం ఈసారి భారతీయ నగరాల్లో ఎలాంటి సందడి చేస్తాయో చూడాలి.

Tags:    

Similar News