టీజర్: 'పెద్దన్న' గా దుమ్మురేపిన సూపర్ స్టార్..!

Update: 2021-10-23 12:43 GMT
సూపర్ స్టార్ రజినీకాంత్ తెరకెక్కుతోన్న తాజా తమిళ చిత్రం ''అన్నాత్తే''. మాస్ డైరెక్టర్ సిరుతై శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాని తెలుగులో ''పెద్దన్న'' అనే పేరుతో విడుదల చేస్తున్నారు. రజినీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - మోషన్ పోస్టర్ మంచి స్పందన తెచ్చుకుంది. ఈ క్రమంలో తాజాగా టీజర్ ను విక్టరీ వెంకటేష్ ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

'కోప్పడి చూడలేదు కదా.. ఉప్పెనరా.. వాడికి అడ్డూ లేదు.. ఒడ్డూ లేదు' అనే పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ''పెద్దన్న'' టీజర్ అలరిస్తోంది. రజనీకాంత్‌ అభిమానులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఉండేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు అర్థమవుతుంది. మిడిల్ ఏజ్ మ్యాన్ గా రజనీకాంత్‌ లుక్ బాగుంది. సూపర్ స్టార్ రెట్టింపు ఉత్సాహంగా ఎనర్జీటిక్ గా చేసిన యాక్షన్ సన్నివేశాలు ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.

టీజర్ చివర్లో రజినీకాంత్ బైక్ పై కత్తి పట్టుకొని వస్తుండటం.. స్టైల్ గా మీసం తిప్పుకుంటూ నడుస్తుండటం వంటివి హైలైట్ గా నిలిచాయి. ఇది గ్రామీణ నేపథ్యంలో ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోసిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. దీనికి డి.ఇమ్మాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ - కెమెరామెన్ వెట్రి పలనిస్వామి అందించిన విజువల్స్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఈ టీజర్ లో మహిళా పాత్రలకు చోటు కల్పించలేదు.

'పెద్దన్న' చిత్రంలో ఖుష్బూ - మీనా - కీర్తి సురేష్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రకాష్ రాజ్ - జగపతి బాబు - సూరి - అభిమన్యు సింగ్ - సతీష్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. రూబెన్ ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేయగా.. దిలీప్ సుబ్బరాయన్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. మిలన్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. తెలుగులో 'పెద్దన్న' సినిమాని ఏషియన్ నారాయణదాస్ కె. నారంగ్ మరియు సురేష్ బాబు కలిసి విడుదల చేస్తున్నారు.


Full View
Tags:    

Similar News