మేమూ మనుషులమేగదా .. కొంచెం కనికరం చూపించండి: పవన్

Update: 2021-09-26 04:01 GMT
సాయితేజ్ - దేవ కట్టా కాంబినేషన్లో రూపొందిన 'రిపబ్లిక్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి జరిగింది. పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన వేదికపైకి చేరుకోగానే అభిమానులు పెద్ద ఎత్తున ఆనందంతో అరుస్తూ .. తమ ఉత్సాహాన్ని ప్రదర్శించారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ .. " ఎంతో దూరం నుంచి వచ్చి .. ఎంతో సహనంతో మీ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నందుకు, మీ అందరికీ నా హృదయ పూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.

నేను ఇంతవరకూ తేజ్ ఫంక్షన్స్ కి రాలేదు. తన మొదటి సినిమా షూటింగు అప్పుడు ఒకసారి వచ్చాను. ఆ తరువాత ఎప్పుడూ రాలేదు. అందుకు ముఖ్యమైన కారణం కూడా ఉంది. 'గోకులంలో సీత' నుంచి నేను ఎప్పుడూ మా అన్నయ్య సపోర్టు తీసుకోలేదు .. ఏ సినిమా వస్తే ఆ సినిమానే చేశాను. అలాగే తేజు ఎవరిపై ఆధారపడకూడదు .. సొంత కాళ్లపై నిలబడాలనే ఉద్దేశంతోనే నేను ఎప్పుడూ రాలేదు. కష్టమో .. నష్టమో తన సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్లాలని అనుకున్నాను.

కానీ ఈ రోజు ఎందుకు వచ్చానంటే, ఈ స్టేజ్ పై హీరోలేని లోటు తెలియకుండా ఉండటం కోసమే. అవును నిర్మాతలు ఎంతో ఖర్చుపెట్టి ఈ సినిమా తీశారు. అందరూ ఆనందంగా ఉండవలసిన రిలీజ్ టైమ్ లో తేజ్ బైక్ యాక్సిడెంట్ బారిన పడటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఫంక్షన్లో హీరో లేని లోటు తెలియకూడదు అనే ఉద్దేశంతో నేను వచ్చాను. ట్రైలర్ చూస్తుంటే సినిమా బాగా వచ్చిందనే విషయం అర్థమవుతోంది .. బాగా ఆడాలని కోరుకుంటున్నాను. తేజ్ ప్రమాదానికి గురైన తరువాత, త్వరగా కోలుకోవాలని చాలామంది కోరుకున్నారు.

కానీ కొన్ని ప్రోగ్రామ్స్ నేను చూశాను .. తేజు చాలా ఫాస్టుగా వచ్చేస్తున్నాడు .. చాలా నిర్లక్ష్యంగా నడుపుతున్నాడు .. అంటూ జరుగుతున్న ప్రచారం చూసి నాకు చాలా బాధకలిగింది. ఇసక మేట కారణంగా అక్కడ పడిపోయాడు. జాలి పడవలసిన సమయంలో ఏవేవో కథనాలు చేశారు. మేమూ మనుషులమే కదా .. కాస్త కనికరం చూపించండి. ఇలాంటి పరిస్థితి మీకు రాదని గ్యారెంటీ ఉందా? దయచేసి కొంత కనికరం చూపించండి" అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.
Tags:    

Similar News