‘వనవాసి’ గుర్తొచ్చిందంటున్న ‘అజ్ఞాతవాసి’.. అడవి బిడ్డలతో పవన్ సందడి

Update: 2020-12-24 08:50 GMT
పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం ‘వకీల్‌ సాబ్‌’ షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నారు. లాక్‌డౌన్ ముగిశాక శరవేగంగా కొనసాగుతున్న ఈ సినిమా షూట్ లో ఇటీవల కాస్త విరామం తీసుకున్నారు పవన్. తాజాగా.. కీలక సన్నివేశాలు చిత్రీకరించేందుకు మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈ షెడ్యూల్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో యాక్షన్ సన్నివేశాలతో పాటు ఫ్లాష్ బ్యాక్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నట్టు సమాచారం.

ఈ షూటింగ్‌లో భాగంగా అరకు వెళ్లిన పవన్‌.. అక్కడి ఆదివాసీలతో కాసేపు సరదాగా గడిపారు. షూటింగ్‌ విరామ సమయంలో ఆదివాసీల జీవన స్థితిగతుల్ని అడిగి తెలుసుకున్నారు పవన్. అయితే.. ఈ సందర్భంగా తమ జీవన స్థితిగతుల్ని ఆదివాసీలు వపన్‌కు పాట రూపంలో వివరించారు.

ఆదివాసీలు పాడిన పాటను వీడియో తీసిన పవన్.. ఆ వీడియోను ట్విటర్‌ వేదికగా తన అభిమానులతో పంచుకున్నారు. ‘నిన్న 'వకీల్ సాబ్' షూటింగ్ విరామంలో.. అరకు ఆదివాసీల ఆంధ్ర-ఒరియాలో అడవితల్లితో ముడిపడ్డ వారి జీవన స్థితిగతుల్ని వివరిస్తూ పాడే పాట.. (వింటుంటే బిభూతి భూషణ్ బందోపాధ్యాయ రచించిన 'వనవాసి' గుర్తుకు వచ్చింది)’ అని పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు.

ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘వకీల్‌ సాబ్‌’ హిందీ ‘పింక్’ సినిమాకు రీమేక్‌ అన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడు. నివేదా థామస్, అంజలి, శృతిహాసన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో ఆయన అభిమానులు ‘వకీల్ సాబ్’ రాక కోసం  ఎదురుచూస్తున్నారు.
Tags:    

Similar News