కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు సన్యాసం.. స్టార్ హీరో సంచలన నిర్ణయం!

వినోద్ ఖన్నా రెండో భార్య కవితా ఖన్నా అత‌డి ఆధ్యాత్మిక ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసారు.;

Update: 2026-04-28 01:30 GMT

బాలీవుడ్ లో అగ్ర కథానాయకుడిగా ఒక శ‌కాన్ని ఏలి.. బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కు గట్టి పోటీనిస్తూ కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో ఒక నటుడు అకస్మాత్తుగా వెండితెరకు గుడ్ బై చెప్పి ఆశ్రమానికి వెళ్లిపోవడం అంటే అది సంచ‌ల‌నం కాకుండా ఉంటుందా? అలాంటి డ్యాషింగ్ ఆలోచ‌న ఉన్న గొప్ప‌ నటుడు వినోద్ ఖన్నా. 1982లో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం చిత్ర పరిశ్రమను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అశేష ప్రజాదరణ, సంపద, కీర్తి అన్నీ ఉన్నా.. వాటన్నింటినీ త్యజించి ఆధ్యాత్మిక గురువు ఓషో రజనీష్ అడుగుజాడల్లో నడవాలని ఆయన నిర్ణయించుకున్నారు. అమెరికాలోని ఒరెగాన్‌లో ఉన్న ఓషో ఆశ్రమానికి వెళ్లి.. అక్కడ ఒక సాధారణ తోటమాలిగా మారిపోయి ధ్యాన మార్గంలో ప్రయాణించారు.

వినోద్ ఖన్నా తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ అప్పట్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన మనసులో నిరంతరం సాగే ఆలోచనల ఘర్షణ, కోపం, తీవ్రమైన ఒత్తిడి వల్ల తాను ఒక `సాచురేషన్ పాయింట్`(పీక్‌)కు చేరుకున్నానని వివరించారు. ధ్యానం చేసినప్పుడు మాత్రమే తనకు మనశ్శాంతి కలుగుతోందని.. అందుకే తన గురువు పాదాల చెంత పూర్తి సమయం గడపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తన ఈ నిర్ణయం కొంత స్వార్థపూరితమైనదే అయినా కానీ.. ఆత్మాన్వేషణ కోసం ప్రతి ఒక్కరూ ఒంటరిగా ప్రయాణించక తప్పదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

వినోద్ ఖన్నా రెండో భార్య కవితా ఖన్నా అత‌డి ఆధ్యాత్మిక ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసారు. అత‌డికి 17 ఏళ్ల వయసు నుంచే ఆధ్యాత్మికతపై ఆసక్తి ఉండేదని.. `ఒక యోగి ఆత్మకథ` పుస్తకాన్ని ఒకే రాత్రిలో చదివి ముగించారని తెలిపారు. అయితే కుటుంబంలో వరుసగా ఐదుగురు అత్యంత సన్నిహితులు.. ముఖ్యంగా తన తల్లి మరణించిన తర్వాత అతడు తీవ్రంగా కృంగిపోయారని.. అదే సమయంలో ఓషో ప్రసంగాలకు ఆకర్షితులై సన్యాసం తీసుకున్నారని ఆమె వెల్లడించారు. ఆశ్రమంలో ఆయన కేవలం 4 బై 6 అడుగుల అతిచిన్న గదిలో నివసించేవారని... అది ఎంత చిన్నదంటే ఆయన తన మంచంపై పడుకోవాలంటే కాళ్లు వాల్చి అడ్డంగా పడుకోవాల్సి వచ్చేదని గుర్తు చేసుకున్నారు.

మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... వినోద్ ఖన్నా ఆశ్రమంలో ఉంటూనే తాను అంతకుముందు అంగీకరించిన `హేరా ఫేరి`, `కుర్బానీ` వంటి సినిమాల షూటింగ్స్‌లో పాల్గొన్నారు. కెమెరా ముందు నటుడిగా కనిపిస్తూనే... షూటింగ్ లేని సమయంలో ధ్యానం చేస్తూ ఆశ్రమంలో ఒక సామాన్య తోటమాలిగా పని చేసేవారు. ఈ ద్వంద్వ జీవితాన్ని ఆయన ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు. తన తండ్రి తీసుకున్న నిర్ణయం గురించి ఆయన కుమారుడు అక్షయ్ ఖన్నా మాట్లాడుతూ.. ఐదేళ్ల వయసులో తనకు అది అర్థం కాలేదని కానీ ఎవరూ సంతోషంగా లేని బంధాన్ని బలవంతంగా కొనసాగించడం కంటే.. ఎవరి కోసం వారు బ్రతకడం తప్పేమీ కాదని... అలా జీవించడానికి చాలా ధైర్యం కావాలని తన తండ్రిని సమర్థించారు.

ప్రముఖ నటుడు కబీర్ బేడీ కూడా వినోద్ ఖన్నాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఓషో ఆశ్రమంలో గడుపుతున్న సమయంలో అక్కడ కొన్ని పరిస్థితులు నచ్చక వినోద్ లాస్ ఏంజిల్స్‌లోని కబీర్ బేడీ వద్దకు వచ్చి సమయం గడిపేవారు. ఆశ్రమంలో జరుగుతున్న అంతర్గత విషయాలన్నీ వినోద్ ద్వారా తనకు తెలుస్తూ ఉండేవని కబీర్ తెలిపారు. ఓషో ఒక గొప్ప తత్వవేత్త అని.. వినోద్ ఖన్నా ఆయనకు గొప్ప భక్తుడిగా మారారని ఆయన పేర్కొన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో తన మనసు వెతుకుతున్న శాంతి లభించిందని భావించిన తర్వాతే వినోద్ ఖన్నా మళ్లీ సాధారణ జీవితంలోకి అడుగుపెట్టారు.

సుమారు ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 1987లో `ఇన్సాఫ్` అనే చిత్రంతో వినోద్ ఖన్నా మళ్లీ బాలీవుడ్‌లోకి ఘనంగా పునరాగమనం చేశారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా అత‌డు తన సత్తా చాటారు. సూర్య, చాందిని వంటి హిట్స్ అందుకున్న అత‌డు త‌న‌ కెరీర్ చివరి దశలో వాంటెడ్, దబాంగ్, దిల్‌వాలే వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో పవర్‌ఫుల్ తండ్రి పాత్రలు పోషించి అందరి మెప్పు పొందారు. ఒక స్టార్ హీరోగా ఉండి కూడా. కీర్తి ప్రతిష్టల కంటే మానసిక ప్రశాంతతే మిన్న అని నిరూపించిన వినోద్ ఖన్నా జీవితం నిజంగా ఒక గొప్ప పాఠం.

Tags:    

Similar News