పూరికి పవన్ పెట్టిన పరీక్ష ఏంటి?

Update: 2015-11-15 05:25 GMT
బద్రి... డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసి సెన్సేషనల్ మూవీ. పవన్ కళ్యాణ్ కు కూడా ఈ సినిమా చాలా స్పెషల్. ఐతే ఈ సినిమా మొదలవడానికి చాలా డ్రామానే నడిచింది. అప్పటికే పూరి దర్శకుడిగా రెండు సినిమాలు మొదలై ఆగిపోయి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో బద్రి కథ రాసి నాగార్జున కోసం ట్రై చేశాడు పూరి. కానీ సినిమా చేసే ఛాన్స్ రాలేదు. తర్వాత ఛోటా కె.నాయుడు ద్వారా పవన్ ను కలిసే అవకాశం సంపాదించాడు పూరి. ఐతే పవన్ ను కలవడానికి ముందు తనకు కథ చెప్పమని, నచ్చితే పవన్ కు చెబుతానని అన్నాడట ఛోటా. ఐతే తనకు ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ కథ చెప్పి ‘ఓకే’ అనిపించుకున్న పూరి.. ఆ తర్వాత పవన్ కు మాత్రం ‘బద్రి’ కథ చెప్పాడట.

అరగంటే టైం అని చెప్పిన పవన్.. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 8 దాకా కథ విన్నాడట. ఐతే కథ నచ్చిందని చెప్పిన పవన్ చివర్లో పూరికి ఓ ట్విస్టు ఇచ్చాడు. అంతా ఓకే కానీ.. క్లైమాక్స్ మాత్రం తనకు నచ్చలేదని.. అది మార్చి తీసుకురమ్మని చెప్పి పంపాడు పవన్. ఆ తర్వాత వారం రోజులల్లో ఏడు క్లైమాక్స్ లు రాసినా పూరికి ఏదీ నచ్చలేదు. రాసిన క్లైమాక్సులన్నీ పక్కనబెట్టేసి పవన్ ను కలిశాడు. పవన్ స్క్రిప్టు చూసి క్లైమాక్స్ మార్చలేదేంటని అడిగితే.. తనకు ఆ క్లైమాక్సే కరెక్ట్ అనిపిస్తోందని చెప్పాడు పూరి. దానికి పవన్ నవ్వి.. ‘‘నిజానికి నాకూ ఆ క్లైమాక్సే నచ్చింది. నీకు కథ మీద ఎంత నమ్మకముందో టెస్ట్ చేద్దామని క్లైమాక్స్ మార్చమన్నా. నువ్వు క్లైమాక్స్ మార్చి ఉంటే సినిమా క్యాన్సిల్ చేసేవాణ్ని’’ అంటూ పూరి డెబ్యూ మూవీకి ఓకే చెప్పేశాడు పవన్. మొత్తానికి పూరి పవన్ పెట్టిన టెస్టు పాసయ్యాడు. దర్శకుడిగా బాక్సాఫీస్ దగ్గర తొలి పరీక్షనూ జయించాడు.
Tags:    

Similar News