చలియే ఆప్ అంటూ హెచ్చరించిన పవన్

Update: 2019-09-23 07:32 GMT
టాలీవుడ్ యాక్టర్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజే వేరు.  అంతే కాదు.. అయన ప్రవర్తన కూడా మిగతా స్టార్ హీరోలకు భిన్నంగా ఉంటుంది. నిన్న 'సైరా' ఈవెంట్ లో కూడా అది మరోసారి నిరూపితమైంది.  పవన్ తనదైన శైలిలో "రాజమౌళి గారు రికార్డులు బద్దలు కొట్టాలి.  సురేందర్ రెడ్డిగారు రికార్డులు బద్దలు కొట్టాలి.. ఇలా ఎవరు గొప్పగా సాధించినా మన తెలుగు సినిమాకు గౌరవం పెరుగుతుంది.. ఇది మనందరికీ గర్వకారణం. ఎందుకంటే  ఇది మన తెలుగు సినిమా.." అంటూ తనదైన శైలిలో కాస్త ఎమోషనల్ గా ప్రసంగిస్తూ ఉన్న సమయంలో ఒక పవన్ అభిమాని సెక్యూరిటీని దాటుకుని పరిగెత్తుతూ స్టేజ్ మీదకు వచ్చాడు. వచ్చి రావడంతోనే పవన్ కాళ్ళపై పడ్డాడు.

ఈ హఠాత్పరిణామానికి ఖంగుతిన్న సెక్యూరిటీ స్టాఫ్ అతన్ని పక్కకు తీసుకుపోయేందుకు వెంటనే వచ్చారు.  పవన్ "ఒకే ఒకే.. ఒకే అమ్మా" అంటూనే అభిమాని చేతిని పట్టుకున్నారు. ఇక సెక్యూరిటీ వారు అతన్నీ లాగేసే సమయంలో ఆ ఫ్యాన్ పవన్ చేతిని గట్టిగా పట్టుకున్నాడు.  సెక్యూరిటీ వారు బలవంతంగా అతన్ని పక్కకు లాగబోతే పవన్ "ఆప్ లోగ్ చలే జాయియే.. ఆప్ లోగ్ పీఛే జాయియే ప్లీజ్"(మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి.. దయచేసి వెనక్కు వెళ్ళండి)"  అంటూ కొంచెం తీవ్ర స్వరంతో సెక్యూరిటీ స్టాఫ్ ను ఆపారు. చివర్లో "చలియే ఆప్"(మీరు వెళ్ళిపోండి) అంటూ హిందీలో హెచ్చరించారు.  వారు పక్కకు పోగానే ఆ అభిమానిని పవన్ ప్రేమగా హత్తుకున్నారు.. దీంతో ఆ అభిమాని సంతోషంతో రెండు చేతులు పైకెత్తి ఆ ఈవెంట్ కు హాజరైన వారికి అభివాదం చేసి సంతోషంగా పక్కకు వెళ్ళాడు. ఆ తర్వాత ఒకక్షణం మౌనంగా ఉన్న పవన్ మళ్ళీ తన స్పీచ్ ను యధావిధిగా కొనసాగించారు.

అనుకుకుండా జరిగిన ఈ సంఘటనకు.. పవన్ స్పందనకు మెగా ఫ్యాన్స్ అరుపులతో... కేకలతో.. ఈలలతో గోలగా తమ జేజేలు తెలిపారు.  పవన్ వెనకే నిలుచుని ఇదంతా చూస్తున్న చిరంజీవి.. రాజమౌళి చిరునవ్వులు చిందించడం అందరినీ ఆకర్షించింది.  ఏతావాతా ఇక్కడ తేలేదేంటంటే.. పవన్ కళ్యాణ్ వేరప్పా. ఆ క్రేజ్ వేరు.. ఫ్యాన్స్ రెస్పాన్స్ వేరు. ఎవరితో కూడా పవన్ ను పోల్చలేం!


   

Tags:    

Similar News