బెదిరించిందెవరో చెప్పొచ్చుగా పవన్?

Update: 2018-12-17 09:00 GMT
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తమతో ఒక సినిమా చేయాలంటూ ఆయన బంధువులు బెదిరించినట్లుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలోనే ఒకసారి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు మరోసారి అవే ఆరోపణలు చేశారు. ఈసారి అందుకు వేదికగా నిలిచింది అమెరికా కావడం విశేషం. ప్రస్తుతం డల్లాస్ లో పర్యటిస్తున్న పవన్.. అక్కడి ప్రవాసాంధ్రులతో సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మాట్లాడుతూ.. 2007లో తనకు ఎదురైన అనుభవం గురించి మరోసారి గుర్తు చేసుకున్నాడు.

అధికారాన్ని దుర్వినియోగం చేయడం తనకు నచ్చదని... 2007లో తాను ‘అన్నవరం’ సినిమా షూటింగ్‌ లో ఉండగా.. తన గదిలోకి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వచ్చి కలిశారని.. తాము అప్పటి ముఖ్యమంత్రి బంధువులని పరిచయం చేసుకున్నారని వెల్లడించాడు పవన్. తమకు సినిమా చేసి పెట్టమని అడిగారని.. నాకు నచ్చితే చేస్తాను అని తాను మర్యాదగా చెప్పానని.. కానీ వాళ్లు తమతో సినిమా చేసి తీరాల్సిందే అంటూ.. తనను కొంత ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడారని పవన్ చెప్పాడు. వారి తీరు తనకు నచ్చక సినిమా చేయలేదని పవన్ చెప్పాడు.

తాను ఎక్కడికి వెళ్లినా లక్షలాది మంది అభిమానులు ఉన్నారని.. ఏ మారుమూల ప్రాంతాలకు వెళ్లినా ప్రజాదరణ ఉందని.. అలాంటి తనను భయపెట్టడం నచ్చలేదని.. రౌడీలు రాజ్యం ఏలే స్థాయి ఉన్నప్పుడు మనమెందుకు మౌనంగా ఉండాలని.. మహాత్మగాంధీ.. అంబేద్కర్ లాంటి మహనీయులు చేసిన త్యాగాలు అందుకేనా అంటూ పవన్ విషయాన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. తాను నటుడినే కావచ్చని.. తాను మెత్తగా.. సున్నితంగా కనిపిస్తానోమో కానీ భయపెడితే భయపడే వ్యక్తిని కానని.. ప్రేమగా మర్యాదగా అడిగితే.. తనకు కుదిరితే తాను చేస్తానని.. కానీ భయపెట్టే విధంగా అడిగితే సహించనని.. అధికారాన్ని అండగా చేసుకొని వ్యక్తులను ప్రభావితం చేయడం తనకు నచ్చదని పెద్ద లెక్చరే దంచాడు పవన్. కానీ అప్పటి ముఖ్యమంత్రి బంధువులు అని చెబుతున్న పవన్ వారి పేర్లు మాత్రం వెల్లడించలేదు. ఇంతకుముందు అదే చేశాడు.. ఇప్పుడూ అదే పాట పాడాడు. మరి అప్పట్లో పవన్ ఎందుకు మౌనంగా ఉన్నాడో.. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాక మళ్లీ మళ్లీ ఆ అంశాన్ని ప్రస్తావించి ఏం సంకేతాలివ్వదలుచుకున్నాడన్నది ఆయనకే తెలియాలి. ఊరికే ఇలా బట్ట కాల్చి ముఖం మీద వేసే వ్యవహారం మాని.. తనను అంతలా బెదిరించిన వాళ్లెవ్వరో చెబితే బాగుంటుంది కదా?
Tags:    

Similar News