దళిత డైరక్టర్ అనకండి ప్లీజ్‌!!

Update: 2016-07-29 11:30 GMT
అదేంటో తెలియదు కాని.. మన మీడియాలో ఒక వింతైన ప్రవర్తన ఉంది. ఎక్కడన్నా ఎవరన్నా వెనుకబడిన కులాలకు చెందిన వారు ఏదైనా సాధించినా.. లేదే ఏదైనా ఇబ్బందులకు గురైనా కూడా.. వారిని వెంటనే కులం పేరుతో ప్రస్తావిస్తుంటారు. ఏదన్నా గోల్డ్ మెడల్ గెలిచినప్పుడు.. మెడల్ గెలిచిన దళిత యువకుడు.. అని రాస్తుంటారు. దాని వలన నిజంగానే వెనుకబడిన వర్గాలకు మేలు జరుగుతుందా లేదా అనేది రాసేవారికే తెలియాలి. అయితే తనను మాత్రం అలా పిలవద్దని అంటున్నాడు దర్శకుడు పా.రంజిత్.

ఈ ''కబాలి'' డైరక్టర్ గతంలో అత్తకత్తి.. మద్రాస్.. సినిమాల్లో కూడా కులాల గురించి ప్రస్తావించాడు. అయితే తాను దళిత వర్గానికి చెందిన వాడిని కాబట్టే ఇలా కులాల గురించి ప్రస్తావిస్తున్నా అనుకోవద్దని.. తాను కులం కారణంగా అణచివేతకు గురయ్యాను కాబట్టే ఇలా కులాల గురించి సినిమాల్లో చూపిస్తున్నానని చెప్పాడు. అంతే కాదు.. తనను దళిత దర్శకుడు అని ప్రస్తావించొద్దని మీడియాకు విన్నపించాడు. ఎక్కడ ఏ కులం వారికి అన్యాయం జరిగినా కూడా దానిని తన సినిమాల్లో చూపిస్తానని.. అది అగ్ర కులం అయినా అణగారిన కులం అయినా సరే అంటున్నాడు రంజిత్. సమాజంలోని అసమానతల గురించి మాట్లాడటానికి దళితులే కావల్సిన అవసరం లేదని చెప్పాడు ఈ కుర్ర దర్శకుడు.

''నేనే కాదు.. ఫిలిం మేకర్ ఎవరైనా కూడా సమాజంలో జరుగుతున్న వాటిని సినిమాల్లో ప్రస్తావించాలి. అసమానతలను ప్రశ్నించాలి. అప్పుడు సినిమాల వలన సోసైటీకి ప్రయోజనం ఉంటుంది'' అంటూ ముగించాడు రంజిత్. నిన్న సాయంత్రం చెన్నయ్ లో కబాలి సక్సెస్ మీటుకు వచ్చిన ఆయన ఈ కామెంట్లు చేశాడులే.
Tags:    

Similar News