కబాలి డైరెక్టర్ రెండు ఆప్షన్లు ఇచ్చాడు

Update: 2016-07-20 06:30 GMT
ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటుంటారు సినిమా వాళ్లు. ఆ వచ్చిన ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే.. ఆ తర్వాత జీవితమే మారిపోతుంది. ‘కబాలి’ దర్శకుడు పా.రంజిత్ అలాగే క్లిక్కయ్యాడు. దర్శకుడయ్యే క్రమంలో అతను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తొలి సినిమా ‘అట్టకత్తి’ పూర్తి చేయడానికి.. విడుదల చేయడానికి చాలా కష్టపడ్డాడు. కానీ ఆ సినిమా విడుదలై జనాల్లోకి వెళ్లాక అతను వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. కార్తితో చేసిన రెండో సినిమా ‘మద్రాస్’ కూడా సూపర్ హిట్టయి కోలీవుడ్లో రంజిత్ పేరు మార్మోగిపోయేలా చేసింది. మూడో ప్రయత్నంలో ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్‌ తోనే సినిమా చేసే అవకాశం సంపాదించాడు రంజిత్.

‘కబాలి’ చేస్తుండగానే రంజిత్ కోసం మరింతమంది స్టార్ హీరోలు లైన్ లోకి వచ్చారు. రంజిత్.. వాళ్లలోంచి సూర్యను ఎంచుకున్నాడు. ‘కబాలి’ విడుదలవడం ఆలస్యం.. సూర్యతో సినిమా మొదలుపెట్టేయబోతున్నాడు రంజిత్. ఇప్పటికే అతను సూర్యకు రెండు కథలు చెప్పాడట. ఒకటి రియల్ ఎస్టేట్ మాఫియా నేపథ్యంలో సాగే కథ.. ఇంకోటి బాక్సింగ్ నేపథ్యంలో నడిచే స్టోరీ.. ఈ రెంటిలో సూర్య ఏది ఎంచుకుంటే ఆ కథకు మెరుగులు దిద్ది కొన్ని రోజుల్లోనే సినిమాను మొదలుపెట్టేయడానికి సన్నాహాలు చేసుకోబోతున్నాడు రంజిత్. ఈ చిత్రానికి నిర్మాత కూడా ఓకే అయిపోయాడు. ప్రస్తుతం సూర్య సింగం-3ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆగస్టులో ఆ సినిమా పూర్తవుతుంది. సెప్టెంబర్లో సూర్య-రంజిత్ సినిమా మొదలయ్యే అవకాశముంది.
Tags:    

Similar News