KBC రేంజులో తెలుగు బుల్లితెర‌పై NTR టాక్ షో

Update: 2020-12-13 07:45 GMT
బుల్లితెర‌పై అమితాబ్ కేబీసీ టాక్ షో ఎంత‌టి సంచ‌ల‌న‌మో తెలిసిందే. ఒకానొక ద‌శ‌లో బిగ్ బి అమితాబ్ ని ఆర్థికంగా ఆదుకున్న టీవీ షో ఇద‌న్న ప్ర‌చారం సాగింది. త‌న‌ను జీరో నుంచి హీరోగా నిల‌బెట్టిన షో కేబీసీ అని అమితాబ్ సైతం వెల్ల‌డించారు.

ఇప్పుడు అలాంటి ఒక టాక్ షోకి తెలుగు నాట ప్లాన్ జ‌రుగుతోంద‌ని.. ఈ  షోకి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్టింగ్ చేస్తార‌ని ప్ర‌చారం సాగుతోంది. గత రెండు రోజులుగా ఎన్టీఆర్ ఒక టెలివిజన్ షోపై సంతకం చేశారని.. అది  జెమిని టీవీలో ప్రసారం అవుతుందని ప్రచారం త‌ర‌పైకొచ్చింది.

ఎన్టీఆర్ ఇప్పటికే ఓకే చెప్పేశారు. ఇందుకోసం అత‌డికి పెద్ద మొత్తంలో పారితోషికం అందుతోంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ  రియాలిటీ షో కౌన్ బనేగా క‌రోడ్ ప‌తి తరహాలో ఉంటుందిట‌. అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేక సెట్ వేసి అందులో చిత్రీక‌ర‌ణ సాగిస్తార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది.

ప్ర‌స్తుతం ఆర్.ఆర్.ఆర్ చిత్రీక‌ర‌ణ‌లో ఉన్న తార‌క్ ఆ షూటింగ్  పూర్తయిన తర్వాత ఫిబ్రవరిలో టాక్‌ షో షూట్ ప్రారంభిస్తార‌ని తెలుస్తోంది. ఎన్టీఆర్ బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 2ని పెద్ద స‌క్సెస్ చేసారు. హోస్ట్ గా తార‌క్ కి వంద‌కు వంద మార్కులు వేశారు ఆడియెన్. అందుకే తాజా టాక్ షోపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. తార‌క్ టీవీ షోను నిర్వహిస్తారనే వార్తలతో అతని అభిమానుల్లో ఉత్సాహం నెల‌కొంది. అలాగే మార్చి నుండి త్రివిక్రమ్ తో మూవీని తార‌క్ ప‌ట్టాలెక్కించ‌నున్నారు.
Tags:    

Similar News