దర్శకధీర ది గ్రేట్: దిమాకున్నోడే దునియా మొత్తం చూస్తాడు!

దర్శకధీర రాజమౌళి కేవలం వెండితెరపై అద్భుతాలను సృష్టించడమే కాదు.. ఆ అద్భుతాలను ప్రపంచం నలుమూలలకు ఎలా తీసుకెళ్లాలో తెలిసిన గొప్ప వ్యూహకర్త.;

Update: 2026-04-26 00:30 GMT

దర్శకధీర రాజమౌళి కేవలం వెండితెరపై అద్భుతాలను సృష్టించడమే కాదు.. ఆ అద్భుతాలను ప్రపంచం నలుమూలలకు ఎలా తీసుకెళ్లాలో తెలిసిన గొప్ప వ్యూహకర్త. ``దిమాకున్నోడే దునియా మొత్తం చూస్తాడు`` అనే మాటకు జక్కన్న ఒక నిలువెత్తు నిదర్శనం. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న `వారణాసి` విడుదలకు ఇంకా ఏడాది సమయం ఉండ‌గానే.. ఈ చిత్రాన్ని గ్లోబల్ మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మార్చేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇటీవలే మెక్సికోలో జరిగిన సీసీఎక్స్‌పీ ఈవెంట్‌లో మేకింగ్ క్లిప్స్‌ను ప్రదర్శించడమే కాకుండా.. తన కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయను నేరుగా పంపి విదేశీ ప్రతినిధులతో చర్చలు జరపడం ఆయన ముందుచూపుకు నిదర్శనం.

రాజమౌళి ప్రచార శైలి `బాహుబలి` సమయం నుంచే ఒక ట్రెండ్ సెట్టర్‌గా మారింది. అప్పట్లో ప్రాంతీయ సినిమాగా మొదలైన బాహుబలిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి ప‌లు అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాలను వేదికగా చేసుకున్నారు. మేకింగ్ వీడియోలు, గ్రాఫిక్స్ పనితీరును విదేశీ సాంకేతిక నిపుణులకు పరిచయం చేయడం ద్వారా ఒక భారతీయ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా క్యూరియాసిటీని పెంచారు. ఆ సినిమా సాధించిన ఘనవిజయం భారతీయ సినిమా మార్కెట్ సరిహద్దులను చెరిపివేసింది.

ఇక `ఆర్.ఆర్.ఆర్` (RRR) విషయానికి వస్తే.. రాజమౌళి అంకితభావం మరో స్థాయికి చేరుకుంది. ఆస్కార్ వేదిక వరకు మన సినిమాను తీసుకెళ్లడం వెనుక అత‌డి ప్లానింగ్, నిరంతర శ్రమ దాగి ఉన్నాయి. యుఎస్ మార్కెట్‌లో నెలల తరబడి మకాం వేసి.. విదేశీ మీడియా సంస్థలతో ముఖాముఖిలు జరుపుతూ.. జపాన్ వంటి దేశాల్లో స్వయంగా పర్యటించి అక్కడి ప్రేక్షకులను మమేకం చేశారు. ఫలితంగా `నాటు నాటు` పాట ప్రపంచాన్ని ఊపేయడమే కాకుండా.. మన సినిమాకు ఆస్కార్ అనే అరుదైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది. అంతర్జాతీయ వేదికలపై ప్రచారం ఎలా ఉండాలో ఆయన విజ‌య‌వంతంగా చేసి చూపించి దేశంలోని సినీదిగ్గ‌జాల‌కే ఆద‌ర్శంగా మారారు.

ఇప్పుడు బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ చిత్రాల కంటే భారీ కాన్వాసుతో రూపొందుతున్న `వారణాసి` కోసం రాజమౌళి అంతకు మించిన ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఈ సినిమాను కేవలం పాన్-ఇండియా కాదు..పాన్-వరల్డ్ మూవీగా తీర్చిదిద్దుతున్నారు. విడుదల సమయంలో మహేష్ బాబు టీమ్ అన్ని దేశాలకు పర్యటించడం సాధ్యం కాదు కాబట్టి... ఇప్పటి నుంచే విదేశీ మార్కెట్లలో చర్చ మొదలయ్యేలా చూస్తున్నారు. కలెక్షన్ల కంటే కూడా సినిమా ఏ ఏ దేశాలకు రీచ్ అయ్యింది.. ఏ స్థాయి డిస్కషన్ జరుగుతోంది అనే అంశానికే ఆయన మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఈ గ్లోబల్ అడ్వెంచర్ మూవీని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ అంతర్జాతీయ పంపిణీ సంస్థలతో టై-అప్ చేసి, అన్ని దేశాల్లో ఒకేసారి భారీ స్థాయిలో విడుదల చేయాలనేది రాజమౌళి సంకల్పం. దీనికోసం విదేశీ మీడియా సంస్థలు నిరంతరం ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా గ్లోబల్ వేదికలను జక్కన్న సమర్థవంతంగా వాడుకుంటున్నారు. ఒక అగ్ర దర్శకుడి అజేయ‌మైన‌ ప్ర‌ణాళిక‌ మేధస్సుతో.. భారతీయ సినిమా జెండాను ప్రపంచ సినిమా శిఖరాగ్రాన ఎగురవేయడానికి రాజమౌళి సిద్ధమవుతున్నారు. ఇది దేశంలోని ఫిలింమేక‌ర్స్ అంద‌రికీ దిక్సూచిగా మారుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News