ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్టు?

Update: 2022-03-25 17:30 GMT
మొత్తానికి భారతీయ ప్రేక్షకులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. 'బాహుబలి' తర్వాత రాజమౌళి రూపొందంచిన 'ఆర్ఆర్ఆర్' ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగానే ఉంది. కథ కొంచెం అసహజంగా ఉంది అన్న కంప్లైంట్ తప్పితే.. మిగతా అన్ని విషయాల్లోనూ 'ఆర్ఆర్ఆర్' రాజమౌళి స్థాయిలోనే ఉంది. తనపై ఎన్ని అంచనాలపై పెట్టుకున్నా.. అంతకుమించి ఔట్ పుట్ ఇచ్చి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే జక్కన్న.. ఈసారి కూడా అదే పని చేశాడు.

సినిమాలో హైలైట్లుగా చెప్పుకోదగ్గ అంశాలు చాలానే ఉన్నాయి. యాక్షన్ ఘట్టాల గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే. ఇవన్నీ పక్కన పెడితే.. ఇందులో లీడ్ రోల్స్ చేసిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లలో ఎవరిది పైచేయి అవుతుంది.. ఎవరి పాత్ర ఎక్కువ పండుతుంది.. పెర్ఫామెన్స్ పరంగా ఎవరిది ఆధిపత్యం అనే ప్రశ్నలకు కూడా సమాధానాలు దొరికిపోయాయి.

ఐతే ప్రోమోలు చూసినపుడు ఏమనిపించిందో.. సినిమా చూసినపుడు కూడా దాదాపు అదే ఫీలింగ్ కలిగిందని చెప్పాలి. కొంతమేర రామ్ చరణ్‌దే ఆధిపత్యం. అందుక్కారణం రామరాజు పాత్రను డిజైన్ చేసిన తీరే. సినిమాలో ఆ పాత్రకు ఉన్నత లక్ష్యం ఉంటుంది (బ్రిటిష్ వారిపై పోరాటానికి ఆయుధాలు సంపాదించడం). తన పాత్రలో షేడ్స్ ఉన్నాయి.

పాత్ర పరంగా బోలెడంత ఎలివేషనూ ఉంది దానికి. కానీ తారక్ పాత్ర అందుకు భిన్నం. అతడి లక్ష్యం చిన్నది (ఒక చిన్న పాపను బ్రిటిష్ వాళ్ల నుంచి రక్షించడం). ఇక క్యారెక్టర్ ప్లెయిన్‌గా, ఫ్లాట్‌గా అనిపిస్తుంది. ఈ పాత్రకు కూడా ఎలివేషన్ ఉన్నప్పటికీ.. రామరాజు క్యారెక్టర్ స్థాయిలో మాత్రం కాదు. హీరో ఎలివేషన్లు, లుక్స్, యాక్షన్ పరంగా రామ్ చరణ్‌దే కాస్త పైచేయి అయింది.

ఎన్టీఆర్ ఎమోషనల్ పెర్ఫామెన్స్ బాగా హైలైట్ అయినప్పటికీ.. ఓవరాల్‌గా చూస్తే ఈ పాత్ర అభిమానులు ఆశించిన స్థాయిలో లేదు. ఇక్కడ చరణ్‌ను ఎక్కువ చేయడం, తారక్‌ను తక్కువ చేయడం కాదు. ఎవరికి వాళ్లు వాళ్ల స్థాయిలో సమానంగా కష్టపడ్డారు. సిన్సియర్ ఎఫర్ట్ పెట్టారు. కానీ పాత్రల పరంగా చరణ్‌దే కొంచెం ఎక్కువ హైలైట్ అయింది. ఈ విషయంలో తారక్ ఫ్యాన్స్ కొంచెం హర్టయినట్లే ఉన్న సంగతి సోషల్ మీడియాను చూస్తే అర్థమవుతోంది.
Tags:    

Similar News