మెగాస్టార్ మూవీలో నితిన్ .. నిజమేనా?!

Update: 2022-06-13 16:30 GMT
చిరంజీవిని కథల విషయంలో ఒప్పించడం చాలా కష్టమనే విషయం తెలిసిందే. కథల విషయంలో ఆయనకి ఉన్న అనుభవం అలాంటిది. కథల విషయంలో ఎక్కడైనా తేడా కొడుతుందని ఆయనకి అనిపిస్తే, అప్పటి సీనియర్ రైటర్ల తో ఆయన వాటిని సెట్ చేయించేవారు. సాధారణంగా ఒక సినిమా తరువాతనే ఆయన మరో సినిమా చేసుకుంటూ వెళ్లేవారు. అంతే తప్ప హడావిడిగా ఆయన ఎప్పుడూ రెండు మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టింది లేదు. అలాంటిది ఈ సారి ఆయన మూడు ప్రాజెక్టులను చాలా తక్కువ గ్యాపులో పట్టాలెక్కించారు.

అయితే ఈ సినిమాలన్నిటిలోను ముఖ్యమైన పాత్రల కోసం మరో హీరో కనిపించనుండటం మరో విశేషం. మెహన్ రాజా దర్శకత్వంలో  చిరంజీవి 'గాడ్ ఫాదర్' చేస్తున్నారు. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నారు. ఆ పాత్రకి ఆయన అయితేనే కరెక్టుగా సెట్ అవుతాడని చిరంజీవి స్వయంగా చెప్పడం విశేషం. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నయనతార కనిపించనుంది.  

ఇక ఆ తరువాత సినిమాగా చిరంజీవి 'వాల్తేర్ వీరయ్య' చేస్తున్నారు. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో చిరంజీవి జాలరుల కుటుంబానికి చెందిన వ్యక్తి గా కనిపించనున్నారు. ఊర మాస్ లుక్ తో చిరంజీవి ఈ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, ముఖ్యమైన పాత్ర కోసం రవితేజను తీసుకున్నారు. చిరంజీవితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఈ సినిమా చేయడానికి రవితేజ ఒప్పుకున్నట్టుగా సమాచారం. త్వరలోనే ఆయన ఈ సినిమా షూటింగులో పాల్గొనే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.

'భోళా శంకర్' సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా నెక్స్ట్  షెడ్యూల్ ఈ నెల 22వ తేదీ నుంచి మొదలవుతుందని  అంటున్నారు. ఈ సినిమాలో తమన్నా కథానాయికగా నటిస్తుండగా , చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనుంది. ఆమె జోడీగా నితిన్ ను ఎంపిక చేసినట్టుగా సమాచారం. గతంలో నితిన్ - కీర్తి సురేశ్ జోడీ 'రంగ్ దే'లో సందడి చేసిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ పట్ల అభిమానంతోనే ఈ గెస్టు రోల్ కిచెయడానికి నితిన్ ఓకే అన్నాడని చెబుతున్నారు.  ఇందులో వాస్తవమెంతన్నది  చూడాలి మరి.     
Tags:    

Similar News