విజయేంద్ర ఆ మాట అనగానే కన్నీళ్లొచ్చేశాయ్

Update: 2016-08-08 09:30 GMT
ఓ అరంగేట్ర హీరో మీద రూ.75 కోట్లు పెట్టి సినిమా తీయడం అన్నది ఇండియాలో ఇంత వరకు జరగలేదు. పెద్ద సినీ కుటుంబాలకు చెందిన వారసులకు కూడా ఆ స్థాయిలో ఎవరూ లాంచ్ చేయలేదు. ఐతే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి మాత్రం తన కొడుకు నిఖిల్ కుమార్ ను హీరోగా పరిచయం చేస్తూ తీస్తున్న ‘జాగ్వార్’ సినిమాకు రూ.75 కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు. ఈ సినిమాను కన్నడతో పాటు తెలుగులోనూ రూపొందిస్తుండటం విశేషం. బాలయ్యతో ‘మిత్రుడు’ సినిమా తీసిన మహాదేవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా విశేషాల గురించి.. విజయేంద్ర కథ అందించడం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విశేషాలు చెప్పారు కుమారస్వామి.. నిఖిల్ కుమార్. ‘జాగ్వార్’ను తెలుగులో కూడా రిలీజ్ చేయాలన్న ఆలోచన చేసింది విజయేంద్ర ప్రసాదే అని చెప్పిన నిఖిల్.. ఆయన తన తండ్రి దగ్గరికి వచ్చి నిఖిల్ ను నా కొడుకు లాగా భావిస్తాను.. అతణ్ని నాకప్పగించండి. అతడి కోసం స్క్రిప్టు రాస్తాను అన్నపుడు చాలా ఎమోషనల్ అయిపోయానని.. కళ్లల్లో నీళ్లు వచ్చేశాయని చెప్పాడు. ఇక కుమారస్వామి మాట్లాడుతూ.. ‘జాగ్వార్’ను కన్నడ-తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తామని.. ఆ తర్వాత తమిళం-మలయాళ భాషల్లోనూ అనువాదం చేస్తామని.. అన్ని భాషల వాళ్లనూ ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పారు.
Tags:    

Similar News