బన్నీ కోసం టెర్రిఫిక్ యాక్టర్

Update: 2019-03-29 05:39 GMT
ఆ మధ్య రజనికాంత్ కాలా సినిమాలో విలన్ గా మెప్పించిన బాలీవుడ్ యాక్టర్ నానా పటేకర్ అంటే తెలియని వారు ఉండరు. వర్సటైల్ ఆర్టిస్ట్ గా తనకు మాత్రమే సాధ్యమయ్యే బాడీ లాంగ్వేజ్ తో డైలాగ్ డెలివరీతో హీరోగా సైతం ఎన్నో ఘన విజయాలను సొంతం చేసుకున్న ట్రాక్ రికార్డు ఆయనది. సామాజిక బాధ్యతలో భాగంగా ఈయన చేసే మంచి పనులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి కూడా.

విశ్వసనీయ సమాచారం మేరకు అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందబోయే సినిమాలో నానాను ఓ కీలక పాత్ర కోసం పరిశీలిస్తున్నట్టు తెలిసింది. అయితే నానా మీద తనుశ్రీ దత్తా కాస్టింగ్ కౌచ్ విమర్శలు చేసిన తర్వాత ఆయన బయట కనిపించడం మానేశారు. హౌస్ ఫుల్ సిరీస్ కొత్త సినిమాలో ఆయన్ను తీసేయడం అభిమానులు సైతం పెద్ద అవమానంగా ఫీలయ్యారు. మరి ఇప్పుడు తెలుగు సినిమా కోసం నానా మేకప్ వేసుకుంటాడా అనేదే డౌట్

దీని విషయంలో యూనిట్ ఇంకా ఏ నిర్ణయానికి రాలేదని తెలిసింది. నానా పటేకర్ కు ఆఫర్ చేసింది కీలకమైన నాన్న పాత్రా లేక ఇంకేదైనా అనే సమాచారం కూడా ఇంకా అందలేదు. ఒకవేళ నానా నిజంగా చేస్తే కొత్త ఆకర్షణ తోడవుతుంది. కాని కాస్టింగ్ కౌచ్ వివాదంలో ఉన్న పరబాషా నటుడిని తీసుకొస్తే ఎలాంటి సమస్యలు రావొచ్చు అనే కోణంలో కూడా చర్చలు జరుగుతున్నాయట.

ఇటీవలే మా జరిపిన ఫంక్షన్ లో కోట శ్రీనివాస రావు ఇదే విషయం మీద ఫైర్ అయ్యారు. సో నానాను తీసుకుంటే ఒక చిక్కు. తీసుకోకపోతే అదే స్థాయి కలిగిన మరో నటుడిని సెట్ చేసుకోవడం అంత కన్నా పెద్ద చిక్కు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభోత్సవంలో విపరీతమైన జాప్యం జరిగిన నేపధ్యంలో వీలైనంత త్వరగా ఇది ఫైనల్ చేయడం చాలా అవసరం
    

Tags:    

Similar News