ఇది 'జాతిరత్నాలు'ను మించిన హిట్ అవుతుంది: నాగ్ అశ్విన్

Update: 2022-05-16 10:30 GMT
పూర్ణోదయా క్రియేషన్స్ అనగానే ఎన్నో క్లాసికల్ సినిమాలు కళ్లముందు కదలాడతాయి. ' సాగర సంగమం' .. 'శంకరాభరణం' .. 'స్వాతిముత్యం' .. 'స్వర్ణ కమలం' ఇలా ఎన్నో కళాత్మక చిత్రాలు మనసులో మెదులుతాయి. ఈ బ్యానర్ పై సినిమాలకి ఎక్కువగా కె విశ్వనాథ్  దర్శకత్వం వహించారు. అప్పట్లో ఒక బ్యానర్  పేరు చూసి సినిమాకి వెళ్లడమనేది కొన్ని బ్యానర్ల  విషయంలో మాత్రమే జరిగింది. అలాంటి అతి కొద్ది బ్యానర్లలో పూర్ణోదయ కూడా ఒకటిగా నిలిచింది. తెలుగు సినిమాల్లో ఆణిముత్యాలు అనిపించుకున్న కొద్ది సినిమాల్లో పూర్ణోదయ సినిమాలు ఎప్పటికీ ఉంటాయి.

అలాంటి ఈ బ్యానర్ పై ఈ మధ్యకాలంలో సినిమాలు రాలేదు. ఏడిద నాగేశ్వరరావు తరువాత ఈ బ్యానర్ పై సినిమాలు   రాలేదు. ఇక ఈ బ్యానర్ పై ఇప్పటి ట్రెండ్ కి తగిన సినిమాలు చేయడానికి ఆయన మనవరాలు శ్రీజ రంగంలోకి దిగింది.

'ఫస్టు డే  ఫస్టు షో' టైటిల్ తో ఒక సినిమాను నిర్మిస్తోంది. వంశీధర్ -  లక్ష్మీ నారాయణ నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు. 'జాతి రత్నాలు' దర్శకుడు అనుదీప్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి  తాజాగా 'టైటిల్ పోస్టర్ ను లాంచ్ చేశారు. టైటిల్ లాంచ్ ఈవెంట్  కి ముఖ్య అతిథిగా దర్శకుడు నాగ్ అశ్విన్ వచ్చారు.   

నాగ్ అశ్విన్ మాట్లాడుతూ .. " చాలాకాలం తరువాత పూర్ణోదయ బ్యానర్ ను మళ్లీ ఆరంభిస్తున్నారు .. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ బ్యానర్ పై 'ఆపద్బాంధవుడు' వచ్చినప్పుడు నేను స్కూల్లో ఉన్నాను. ఆ సినిమా సరిగ్గా ఆడలేదని తెలిసి .. ఇంతమంచి సినిమా ఎందుకు ఆడలేదని చెప్పేసి నాకు చాలా కోపం వచ్చింది. అలాంటి నేను ఈ బ్యానర్  పై నిర్మిస్తున్న సినిమా ప్రమోషన్ కి  హెల్ప్ అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బ్యానర్ లో పనిచేసే అవకాశం వస్తే నిజంగా నాకు చాలా హ్యాపీ.

అనుదీప్  కథ .. స్క్రీన్ ప్లే  .. డైలాగ్స్ ఇచ్చాడంటే ఈ సినిమా తప్పకుండా బాగుంటుంది. అనుదీప్ తనకి వచ్చిన  స్థాయిలోనే తన టీమ్ కూడా ఎదగాలని కోరుకుంటూ వాళ్లకి తను అవకాశాలు ఇస్తూ వెళ్లడం నాకు నచ్చింది.

ఈ విషయంలో నేను ఆతనిని చూసి గర్వపడుతున్నాను. ఈ సినిమా ఎలా ఉండబోతోందా అని నాకే చాలా క్యూరియాసిటీ గా ఉంది. ఈ సినిమాకి రధన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. పాటలన్నీ కూడా చాలా సుపర్బ్ గా ఉంటాయని భావిస్తున్నాను. త్వరలో టీజర్లు ..  ట్రైలర్లు వస్తాయి. ఈ సినిమా 'జాతిరత్నాలు'కు మించి హిట్ అవుతుందని భావిస్తున్నాను" అంటూ  చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News