కన్ఫర్మ్‌ నాగార్జున సినిమా ఆగిపోలేదు

Update: 2020-11-05 06:30 GMT
సుదీర్ఘ కాలం తర్వాత టాలీవుడ్‌ స్టార్‌ కింగ్‌ నాగార్జున బాలీవుడ్‌ లో నటిస్తున్న సినిమా 'బ్రహ్మాస్త్ర'. బాలీవుడ్‌ స్టార్స్‌ అమితాబచ్చన్‌... రణబీర్‌ కపూర్‌.. ఆలియా భట్‌.. మౌనీరాయ్‌ తో పాటు ప్రముఖులు నటిస్తున్న బ్రహ్మాస్త్ర సినిమాలో నాగార్జున ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్‌ షూట్‌ లో కూడా నాగార్జున పాల్గొన్నాడు. హిందీలోనే కాకుండా తెలుగులో కూడా మంచి క్రేజ్‌ ఉన్న బ్రహ్మాస్త్ర సినిమా బడ్జెట్‌ కారణాల వల్ల ఆగిపోయింది అంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. సినిమా బడ్జెట్‌ పెరిగి పోతున్న కారణంగా నిడివి తగ్గించాలంటూ నిర్మాణ సంస్థ దర్శకుడికి సూచించిందని.. అందుకు ఆయన ఒప్పుకోలేదు అనే ప్రచారం జరిగింది. దాంతో సినిమా తాత్కాలికంగా ఆగిపోయిందనే పుకార్లు షికార్లు చేశాయి.

ఆ వార్తలు అన్ని కూడా నిజం కాదంటూ చెప్పకనే చెప్పారు. తాజాగా బ్రహ్మాస్త్ర షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. ప్రముఖ నటీనటులు ఈ ఇప్పటికే షూటింగ్‌ లో జాయిన్‌ అయ్యారు. ప్రస్తుతం వైల్డ్‌ డాగ్‌ షూట్‌ లో పాల్గొంటున్న నాగార్జున మరో వారం రోజుల్లో షూటింగ్‌ ను పూర్తి చేసుకుంటాడు. ఆ తర్వాత వెంటనే బ్రహ్మాస్త్ర షూటింగ్‌ లో జాయిన్‌ అవ్వబోతున్నాడు. ఒక వైపు బిగ్‌ బాస్‌ చేస్తూ మరో వైపు బ్రహ్మాస్త్ర షూటింగ్‌ లో కూడా పాల్గొంటూ నాగ్‌ బిజీ బిజీగా గడుపబోతున్నాడు.

కరోనా టైంలో చాలా మంది సీనియర్‌ హీరోలు ఇంటికే పరిమితం అవుతున్న సమయంలో నాగార్జున మాత్రం చాలా సాహసంతో వరుస షూటింగ్‌ ల్లో పాల్గొంటున్నాడు. హిందీలో నాగార్జున సినిమా ఆగిపోయిందనే వార్తల నేపథ్యంలో అక్కినేని అభిమానులు కాస్త ఉసూరుమన్నారు. తాజాగా షూటింగ్‌ పునః ప్రారంభం అవ్వడంతో అక్కినేని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత నాగ్‌ చేయబోతున్న సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత ప్రారంభం కాబోతుంది.
Tags:    

Similar News