మెగాస్టార్ తరువాత స్థానంలో మాస్ మహారాజ్!

Update: 2022-01-29 00:30 GMT
టాలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలతో నటుడుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన రవివర్మ, ఈ మధ్యనే గుర్తుపెట్టుకోదగిన ముఖ్యమైన పాత్రలను అందుకుంటూ వస్తున్నాడు. తాజాగా ఆయన 'భీమ్లా నాయక్'లోను ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన అనేక ఆసక్తికరమైన విషయాలను గురించి మాట్లాడాడు. "నేను చరణ్ గారితో కలిసి 'వినయ విధేయరామ' సినిమా చేశాను. అందులో ఆయన బ్రదర్స్ లో ఒకరిగా కనిపిస్తాను. ఆ పాత్ర చేసేటప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. అంత బాగా చేయడానికి తగిన కంఫర్టును ఆయన ఇచ్చారు.

ఎలాగైనా నేను ఒకసారి చిరంజీవిగారిని కలవాలని చరణ్ గారితో చెప్పాను. ఆ సినిమా షూటింగు చూడటానికి చిరంజీవి గారు వచ్చినప్పుడు, ఆయనని కలిసే ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు నేను చిరంజీవిగారితో కొంతసేపు మాట్లాడాను. ఆ క్షణాలను నేను ఎప్పటికీ మరిచిపోలేను. చరణ్ గారు సెట్లో చాలా సింపుల్ గా .. సరదాగా ఉంటారు. ఆయన తన స్టార్ డమ్ ను పక్కన పెట్టేయడం వలన, మేమంతా ఎంజాయ్ చేస్తూనే చేశాము. ఇండస్ట్రీకి వచ్చిన తరువాత చాలామంది హీరోలతో కలిసి పనిచేశాను. ఇంకా చిరంజీవిగారు .. రవితేజగారు .. వెంకటేశ్ గారితో కలిసి పనిచేయాలని ఉంది. అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నాను.

చిరంజీవిగారు ఎంతో కష్టపడి మెగాస్టార్ అయ్యారు .. ఆయన తరువాత అంత కసితో ఎదుగుతూ వచ్చిన హీరోగా రవితేజ కనిపిస్తారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి నిలబడిన హీరో ఆయన. 'కృష్ణ' సినిమా చేస్తున్నప్పుడు నేను రవితేజను కలిశాను. "జాబ్ కోసం యూఎస్ వెళ్లవలసి వచ్చేలా ఉంది .. ఏం చేయాలో అర్థం కావడం లేదు" అని ఆయనతో అన్నాను. అప్పుడు నాతో ఆయన ఒకమాట అన్నారు. " నీకు కంప్యూటర్స్ .. యాక్టింగ్ రెండూ తెలిసి ఉండటమే నీ ప్రోబ్లం. అందువల్లనే ఏది చేయాలా అని ఆలోచిస్తున్నావు.

నాకు తెలిసింది సినిమా మాత్రమే .. నేను హీరో కాకపోయినా నేను ఇక్కడే ఉండేవాడిని" అన్నారు. ఆయన చెప్పిన ఆ మాట నాకు బాగా గుర్తుంది. ఇక్కడే ఉంటాను .. ఇక్కడే ఉండాలి .. అందుకు అవసరమైనవన్నీ చేస్తాను అనే ఆలోచన ఆయన నుంచి వచ్చిందే. చాలా చిన్న చిన్న పాత్రల నుంచి హీరో అనిపించుకుని, ఈ రోజున మాస్ మహారాజ్ కావడమంటే మజా కాదు. ఇప్పటికీ ఆయన ఎంతో హార్డ్ వర్క్ చేస్తుంటారు. అలాంటి రవితేజతో 'క్రాక్'లో చేసే ఛాన్స్ వచ్చి తప్పిపోయింది. ఆయనతో కలిసి నటించే ఛాన్స్ వస్తుందనే ఆశిస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు
Tags:    

Similar News