కార్తీకి లక్కీ ఛాన్స్‌

Update: 2015-07-06 04:14 GMT
జీవితంలో ఒక్కసారైనా మణిరత్నం సినిమాలో నటించాలనే కోరిక ప్రతీ కథానాయకుడికీ ఉంటుంది. ఆమాటకొస్తే ప్రతీ నటుడి మనసులోనూ ఆ కోరిక ఉంటుంది. సెల్యులాయిడ్‌పై కథ చెప్పడంలో మణిరత్నం ఓ మాస్టర్‌. ఆయన పెట్టిన ఫ్రేమ్‌లో తమను తాము చూసుకొని జీవితాంతం ఆనందపడుతుంటారు నటీనటులు. సినిమా సక్సెస్‌ అయినా ఫెయిల్యూరయినా మణి సినిమా మణి సినిమానే. అందుకే ఇప్పటికీ ఆయనకి క్రేజ్‌ తగ్గలేదు. ఇదంతా ఎందుకు చెప్పాల్సొస్తుందంటే... మణిరత్నం దర్శకత్వంలో నటించే అవకాశం ఇప్పుడు తమిళ కథానాయకుడు కార్తీకి దక్కడంతో!

   'ఓకే బంగారం'తో ఇటీవల అదిరిపోయే హిట్టు కొట్టేశాడు మణిరత్నం. చాలా రోజుల తర్వాత ఆయన మార్క్‌ మళ్లీ తెరపై స్పష్టంగా కనిపించింది. మణిరత్నం ఎవర్‌గ్రీన్‌ అన్నారు సినిమా చూసినవాళ్లంతా. ఆ సినిమా అందించిన ఉత్సాహంలో ఉన్న మణి ఇప్పుడు కొత్త సినిమాకి రంగం సిద్ధం చేసుకొంటున్నాడు. ఈసారి ఆయన కార్తీ కథానాయకుడిగా ఓ సినిమా తీయాలని భావిస్తున్నాడట. ఇటీవలే మణి, కార్తీ కథ గురించి డిస్కషన్స్‌ కూడా జరిపారని సమాచారం. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి.

     మణిరత్నం దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశాడు కార్తి. 'పరుత్తి వీరన్‌'లో నటించే అవకాశం రావడంతో మణిరత్నం దగ్గర శిష్యరికానికి గుడ్‌ బై చెప్పి కెమెరా ముందుకొచ్చేశాడు కార్తి. ఇప్పుడు తన గురువు దర్శకత్వంలో నటించే అవకాశం రావడంతో ఎగిరి గంతేస్తున్నాడు కార్తి.

Tags:    

Similar News