నేను ఇండ‌స్ట్రీ వైపు.. ప్ర‌కాష్ రాజ్ ఎటువైపో చెప్పాలి!- మంచు విష్ణు

Update: 2021-09-28 10:30 GMT
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌లు వేడి పెంచుతున్న సంగ‌తి తెలిసిందే. ఇంకో 12 రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ప్ర‌స్తుతం నామినేష‌న్ల ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఇంత‌కుముందు ప్ర‌కాష్ రాజ్ ఆయ‌న ప్యానెల్ నామినేష‌న్లు వేశారు. ఈ మంగ‌ళ‌వారం ఉద‌యం మంచు విష్ణు ఆయ‌న ప్యానెల్ స‌భ్యులు కూడా నామినేష‌న్లు వేశారు. అనంత‌రం విష్ణు మీడియాతో మాట్లాడుతూ  ప్ర‌కాష్ రాజ్ పై త‌న‌దైన శైలిలో ప్ర‌శ్న‌ల్ని సంధించారు.

ఈరోజు నామినేష‌న్ వేశాం. మేమంతా గెలుస్తాం. అక్టోబ‌ర్ 10న మ‌ళ్లీ మాట్లాడుకుందాం.. అని తెలిపిన విష్ణు తెలుగు ఇండ‌స్ట్రీ బిడ్డ‌గా న‌టుడిగా ఛాంబ‌ర్ వారు ఏపీ ప్ర‌భుత్వానికి బాస‌ట‌గా (ప‌వ‌న్ కి వ్య‌తిరేకంగా) ఇచ్చిన లేఖ సారంతో ఏకీభ‌విస్తున్నాను అని మీడియా ప్ర‌శ్న‌కు జ‌వాబిచ్చారు.

నేను తెలుగు ఇండ‌స్ట్రీ ప‌క్క‌న ఉన్నాను. ఫిలింఛాంబ‌ర్ రిలీజ్ చేసిన స్టేట్ మెంట్ .. నిర్మాత‌ల వెర్ష‌న్ అది. దాని కి నేను క‌ట్టుబ‌డి ఉన్నాను. నిర్మాత లేక‌పోతే డ‌బ్బు పెట్టేవాళ్లు లేన‌ట్టే. వాళ్లే లేక‌పోతే ఇండ‌స్ట్రీ లేదు. వాళ్లు ప్ర‌భుత్వంతో చ‌ర్చ లు సాగిస్తున్నారు. ప్రాసెస్ సాగుతోంది. అని విష్ణు అన్నారు.

ప్ర‌కాష్ రాజ్ గారు తెలుగు ఇండ‌స్ట్రీ వైపు ఉన్నారా?  లేదా ప‌వ‌న్ క‌ల్యాణ్‌ వైపు ఉన్నారా? ఎవ‌రి వైపు ఉన్నారు? అన్న‌ది చెప్పాలి. తెలుగు ఫిలింఇండ‌స్ట్రీ వాళ్లంతా మిమ్మ‌ల్ని న‌మ్ముకున్నారు. మా జీవ‌నాధార‌మిదీ .. దీనికి మీరు స‌మాధానం ఇవ్వాలి... అంటూ త‌న‌దైన శైలిలో ప్ర‌శ్న‌లు కురిపించారు. మ‌రి దీనికి ప్ర‌కాష్ రాజ్ స‌మాధానం ఏమిటో.. ఇంత‌కుముందే ప్ర‌కాష్ రాజ్ కూడా ప‌వ‌న్ కి మ‌ద్ధ‌తు వ్య‌వ‌హారంలో డిప్ల‌మాటిగ్గా వ్య‌వ‌హ‌రించ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ప్ర‌కాష్ రాజ్ సేఫ్ గేమ్..!

స్టార్ హీరో.. జ‌న‌సేనాని ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్ ‌క‌ల్యాణ్ ఇటీవ‌ల `రిప‌బ్లిక్‌` ప్ర‌చార వేదిక‌పై ఏపీ ప్ర‌భుత్వంపై.. మంత్రుల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఇండ‌స్ట్రీలో తీవ్ర దుమారాన్ని సృష్టించాయి. అయితే ఈ విష‌యంలో ప‌వ‌న్‌ కు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డానికి ఏ ఒక్క‌రూ సాహ‌సించ‌డం లేదు. చివ‌రికి ప‌వ‌న్ మ‌ద్దుతుగా మాట్లాడిన ప్ర‌కాష్ ‌రాజ్ కూడా సోమ‌వారం `మా` అధ్య‌క్ష ప‌ద‌వి కోసం నామినేష‌న్ వేసిన ప్ర‌కాష్‌ రాజ్ ఆచితూచి స్పందించాడు.

ప్ర‌తి విష‌యాన్ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు మాట్లాడే ప్ర‌కాష్ ‌రాజ్.. త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ ‌ని స‌మ‌ర్ధించ‌కుండా త‌ప్పించుకునే ప్రయ‌త్నం చేయడం గ‌మ‌నార్హం. సోమ‌వారం త‌న ప్యానెల్ స‌భ్యుల‌తో క‌లిసి నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప్ర‌కాష్‌ రాజ్ ఆ త‌రువాత మీడియాతో మాట్లాడారు. ఇవి రాజ‌కీయ ఎన్నిక‌లు కాద‌ని పోటీ మాత్ర‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. గెలిపించేది.. ఓడించేది ఓట‌ర్లే అని చెప్పారు. అయితే ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ చేసిన విమ‌ర్శ‌ల‌పై ప్ర‌కాష్ రాజ్ స్పందించిన తీరు ప‌లువురికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది.

ప‌వ‌న్ ఓ రాజ‌కీయ నాయ‌కుడు.. దేశం కోసం పోరాడుతున్నాడు.. ఆయ‌నొక మంచి నాయ‌కుడు.. అత‌ని కంటూ కొన్ని సిద్ధాంతాలున్నాయి. ప‌వ‌న్ `మా` స‌భ్యుడే అని తెలిపారు. అయితే ఎవ‌రు ఎన్ని చెప్పినా ఆయ‌న మంచి కోస‌మే మాట్లాడ‌తార‌ని.. ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు దాని ప్ర‌తిఫ‌లాన్ని బ‌ట్టి ముందుకు వెళ‌తామ‌ని ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు. ప్ర‌తి ఒక్క‌రిలోనూ ప్రేమ‌.. ఆవేశం వుంటాయ‌ని.. వాళ్ల‌ని మాట్లాడ‌నివ్వాల‌ని ప్ర‌కాష్‌ రాజ్ కోరారు. త‌న ప్యానెల్ ల‌క్ష్యం అభ్యుద‌య‌మేన‌ని తెలిపిన ప్ర‌కాష్‌ రాజ్ రాజ‌కీయ వ్యాఖ్య‌ల‌పై ద‌య‌చేపి ఎవ‌రూ ప్ర‌శ్నించ‌వ‌ద్ద‌ని ప్ర‌కాష్‌ రాజ్ కోర‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

సూటిగా ప్రశ్నిస్తూ మాట్లాడే ప్ర‌కాష్ ‌రాజ్ ఇలా డిప్ల‌మాటిక్‌ గా మాట్లాడ‌టం ఏంట‌ని అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. తాను ఏం మాట్లాడినా అది `మా` ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం చూపుతుంద‌న్న ఆందోళ‌న ప్ర‌కాష్‌ రాజ్ మాటల్లో స్ప‌ష్టంగా క‌నిపించింద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందించ‌కుండా ప్ర‌కాష్‌ రాజ్ ఇత‌ర అంశాల గురించి మాట్లాడ‌టం ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని చెబుతున్నారు. ప్ర‌కాష్‌ రాజ్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడ‌ని కూడా విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News