మూవీ రివ్యూ : మన ఊరి రామాయణం

Update: 2016-10-08 10:25 GMT
చిత్రం: ‘మన ఊరి రామాయణం’

నటీనటులు: ప్రకాష్ రాజ్ - ప్రియమణి - సత్యదేవ్ - పృథ్వీ - రఘుబాబు తదితరులు
సంగీతం: ఇళయరాజా
ఛాయాగ్రహణం: ముకేష్
కథ: జో మాథ్యూ
మాటలు: ప్రకాష్ రాజ్ - రమణ గోపిశెట్టి
నిర్మాతలు: ప్రకాష్ రాజ్ - రామ్ జీ
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: ప్రకాష్ రాజ్

జయాపజయాలతో సంబంధం లేకుండా దర్శకుడిగా తన అభిరుచికి తగ్గట్లు సినిమాలు తీస్తూ వస్తున్నాడు ప్రకాష్ రాజ్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త సినిమా ‘మనవూరి రామాయణం’. మరి ఈ సినిమాతో ప్రకాష్ రాజ్ ఏం చెప్పాడు.. ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచాడు.. చూద్దాం పదండి.

కథ:

ఒక చిన్న స్థాయి పట్టణం.. అందులో మంచి పేరు ప్రఖ్యాతులు.. గౌరవ మర్యాదలు ఉన్న పెద్ద మనిషి భుజంగయ్య (ప్రకాష్ రాజ్). ఒక రాత్రి పూట ఇంట్లో వాళ్లతో గొడవపడి బయటికి వెళ్లిపోతాడు భుజంగయ్య. తాగిన మత్తులో అతడికి ఓ అమ్మాయితో గడపాలన్న కోరిక పుడుతుంది. తనకు అసిస్టెంటు లాగా పని చేసే శివ (సత్యదేవ్)ను ఆ పనికి పురమాయిస్తాడు. శివ.. సుశీల (ప్రియమణి) అనే వేశ్యను తీసుకొస్తాడు. ఇద్దరినీ ఓ షాపులో పెట్టి బయటికి వెళ్తాడు. ఐతే శివ అనుకోకుండా పోలీసుల దగ్గర చిక్కుకుంటాడు. భుజంగయ్య.. సుశీల లోపల ఇరుక్కుపోతారు. మరి ఈ పరిస్థితుల్లో వాళ్లిద్దరూ ఎలా బయటికి వచ్చారు.. ఈ సమస్య నుంచి బయటపడే క్రమంలో భుజంగయ్యలో ఎలాంటి మార్పు వచ్చింది అన్నది మిగతా కథ.
Read more!

కథనం-విశ్లేషణ:

దర్శకుడిగా తాను చేసిన గత మూడు సినిమాలతోనూ ప్రకాష్ రాజ్ కు ఆర్థికంగా చేదు అనుభవాలే మిగిలాయి. అయినప్పటికీ ఆయన తన అభిరుచిని విడిచి పెట్టలేదు. మరోసారి వైవిధ్యమైన కథనే ఎంచుకున్నారు. తన సినిమా ద్వారా జనాలకు ఏదో చెప్పాలనే చూశారు. ‘మన ఊరి రామాయణం’ రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కోవలోకి రాదు. ఇది ఒక ప్రత్యేకమైన చిత్రం. ఇలాంటి సినిమాలు చూడ్డానికి అభిరుచి ఉండాలి. అలాగే కొంచెం ఓపిక కూడా చేసుకోవాలి. అంతర్లీనంగా ప్రకాష్ రాజ్ చెప్పాలనుకున్న మంచి విషయాల్ని అర్థం చేసుకోవడానికి.. వాటి గురించి ఆలోచించడానికి.. ఇందులోని ఎమోషన్లను అనుభూతి చెందడానికి కొంచెం పెద్ద మనసే ఉండాలి.

‘మనఊరి రామాయణం’ కచ్చితంగా ఓ మంచి.. వైవిధ్యమైన ప్రయత్నం. ఇందులోని కొన్ని అంశాలు బలమైన ముద్ర వేస్తాయి. కానీ ఈ సినిమాను అర్థం చేసుకునే మనసు ఎంతమందికి ఉంటుందనేది సందేహం. ఈ కథను ఎక్కువమందికి చేరేలా.. ఆసక్తికరంగా చెప్పడానికి ప్రకాష్ రాజ్ ప్రయత్నించాల్సింది. పరిమితమైన పాత్రలతో మెజారిటీ సినిమా ఒకే లొకేషన్లో సాగడం వల్ల ఒక ఆర్ట్ సినిమా చూస్తున్న భావన కలుగుతుంది ‘మన ఊరి రామాయణం’ చూస్తుంటే. సన్నివేశాలు రిపిటీటివ్ గా అనిపించడం పెద్ద బలహీనత.
4

‘మన ఊరి రామాయణం’ నిడివి 1 గంట 52 నిమిషాలే. అయినప్పటికీ ఇది కొంచెం పెద్ద సినిమాలా అనిపిస్తుంది. కొన్నిసార్లు సహనాన్ని పరీక్షిస్తుంది. ఒకే సన్నివేశాల్ని మళ్లీ మళ్లీ చూస్తున్న భావన కలిగిస్తుంది. ప్రధాన పాత్రధారులిద్దరూ లోపల ఇరుక్కుపోయాక.. వాళ్లిద్దరూ బయటికెలా వస్తారనే విషయంలో ఉత్కంఠ రేకెత్తించేలా కథనాన్ని నడిపించలేకపోయాడు ప్రకాష్ రాజ్. ఇక్కడ ఉత్కంఠ కంటే కూడా ప్రేక్షకుడిలో ఒకరకమైన అసహనం కలుగుతుంది. దాదాపుగా పాత్రధారుల పరిస్థితే ప్రేక్షకుడికీ ఎదురవుతుంది. ప్రియమణి గట్టి గట్టిగా అరవడం.. ప్రకాష్ రాజ్ గొంతు తగ్గించమని ప్రాధేయపడ్డటం.. పదే పదే కిటికీ దగ్గరికెళ్లి తొంగి చూడటం.. ఈ సన్నివేశాలే మళ్లీ మళ్లీ కనిపిస్తాయి. మరీ రిపిటీటివ్ గా అనిపిస్తాయి.

రాత్రి పోలీసుల దగ్గర చిక్కుకుని.. ఉదయం బయటికి వచ్చేశాక శివ పాత్రధారి ఆ గది తాళాలు తీయలేకపోవడానికి సరైన కారణాలు కనిపించవు. దీనికి సంబంధించిన కారణాలు ఫోర్స్డ్ గా అనిపిస్తాయి. ఐతే ప్రకాష్ రాజ్ లో రియలైజేషన్ వచ్చే సన్నివేశాలు బాగా తీర్చిదిద్దారు. తాళం తీసే విషయంలో ట్విస్టు బాగుంది. ఐతే తాళం వచ్చేయగానే లోపలున్న పాత్రధారుల్లో ఉద్వేగం ఏమీ కనిపించకపోవడం.. ఎవరు తీశారని చూడకపోవడం లాజికల్ గా అనిపించదు. క్లైమాక్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఎమోషన్లు గొప్పగా పండాయి ఇక్కడ. అంతకుముందు కథనం ఎలా సాగినప్పటికీ సినిమాను ముగించిన తీరు మాత్రం ప్రకాష్ రాజ్ మీద గౌరవం పెరిగేలా చేస్తుంది. పతాక సన్నివేశాల వరకు ఒక గొప్ప సినిమా చూస్తున్న అనుభూతిని ‘మన ఊరి రామాయణం’ కలిగిస్తుంది.

ఒక మంచి కథకు తగ్గట్లుగా కథనం కుదరలేదు ఇందులో. ఐతే నటీనటుల గొప్ప అభినయం.. సాంకేతిక నిపుణుల కృషి గ్రాఫ్ మరీ పడిపోకుండా చూశాయి. ప్రకాష్ రాజ్ గత సినిమాల్లాగే ‘మన ఊరి రామాయణం’ కూడా రీమేకే. 2012లో మలయాళంలో వచ్చిన ‘షట్టర్’కు ఇది రీమేక్. ఐతే సినిమా చూస్తుంటే ఒరిజినల్ లాగే కనిపిస్తుంది. దీనికి తెలుగు టచ్ ఇవ్వడంలో.. దర్శకుడిగా తన ముద్ర చూపించడంలో ప్రకాష్ రాజ్ విజయవంతమయ్యాడు. ఏమాత్రం రాజీ పడకుండా.. కమర్షియల్ గా ఇది ఏమాత్రం వయబుల్ అని ఆలోచించకుండా ఇలాంటి కథను చెప్పాలనుకోవడంలో ప్రకాష్ రాజ్ అభిరుచికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. సినిమాలో ఏదీ సూటిగా చెప్పకుండా.. అంతర్లీనంగా కొన్ని మంచి విషయాలు.. గొప్ప సందేశం ఇచ్చిన తీరు ఆకట్టుకుంటుంది. ఇది అర్థం చేసుకున్న వాళ్లకు ‘మన ఊరి రామాయణం’ మంచి అనుభూతిని కలిగిస్తుంది. లేని పక్షంలో కష్టం.

నటీనటులు:

ఈ సినిమాకు అతి పెద్ద ఆకర్షణ నటీనటుల అభినయమే. ప్రకాష్ రాజ్ తన నటన స్థాయిని మరోసారి చూపించాడు. ఇందులో ఆయనకు డైలాగులు తక్కువ. చాలా వరకు హావభావాలతోనే నడిపించాలి. ఆ విషయంలో ప్రకాష్ రాజ్ నిరాశ పరచలేదు. ఇక ప్రియమణిలోని మంచి నటి మరోసారి అవార్డు స్థాయి నటన కనబరిచింది. కెరీర్ చరమాంకంలో ప్రియమణి చేసిన ఈ పాత్రతోనే ఆమెను గుర్తుంచుకుంటారు జనాలు. ఆమె లుక్ కూడా చాలా బాగుంది. పృథ్వీ ఇప్పుడు చేస్తున్న కామెడీ పాత్రలకు భిన్నంగా సీరియస్ రోల్ లోనూ మెప్పించాడు. సత్యదేవ్ కూడా ఆకట్టుకున్నాడు. కథ ప్రధానంగా ఈ నలుగురి చుట్టూనే తిరుగుతుంది. ఈ నలుగురూ సినిమాకు నాలుగు స్తంభాల్లాగా నిలిచారు.

సాంకేతిక వర్గం:

‘మన ఊరి రామాయణం’కు సాంకేతిక హంగులు కూడా చక్కగా కుదిరాయి. ఇళయరాజా మనసు పెట్టి చేస్తే నేపథ్య సంగీతం ఎంత బాగుంటుందో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ముకేష్ ఛాయాగ్రహణంతో పాటు ఆర్ట్ వర్క్ కూడా బాగా అమరింది. చాలా తక్కువ బడ్జెట్లోనే సినిమాను ముగించారన్న సంగతి సినిమా చూస్తుంటే అర్థమవుతుంది. చిన్న స్థాయి పట్టణ వాతావరణాన్ని.. అక్కడ జరిగే ఉత్సవాలను చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. మాటలు సన్నివేశాలకు తగ్గట్లు బాగున్నాయి. రీమేకే అయినప్పటికీ ప్రకాష్ రాజ్ దర్శకుడిగా తన ముద్రను చూపించే ప్రయత్నం చేశాడు. ఆయన అభిరుచి సినిమా అంతటా కనిపిస్తుంది. ఐతే స్క్రీన్ ప్లే మరింత ఆసక్తికరంగా వేగంగా ఉండేలా చూసుకోవాల్సింది.

చివరగా: మన ఊరి రామాయణం.. మంచి ప్రయత్నమే కానీ!

రేటింగ్- 2.75/5

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/


Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News