కబాలి బురుగేంటో తెలిసిపోయింది

Update: 2016-07-28 17:30 GMT
స్టార్ హీరోల సినిమాలు ఇంకా సెట్స్ మీదికి వెళ్లకముందే విపరీతమైన హైప్ తీసుకురావడం.. సినిమాను రికార్డు రేట్లకు అమ్మడం.. భారీగా రిలీజ్ చేయడం.. ఫస్ట్ వీకెండ్ లోనే సాధ్యమైనంత ఎక్కువ వసూళ్లు రాబట్టడం.. ఈ ఫార్ములాను తెలుగు సినిమా కొన్నేళ్ల నుంచి అనుసరిస్తూ వస్తోంది. అందుకే నెగెటివ్ టాక్ వచ్చిన సినిమాలు కూడా భారీ ఓపెనింగ్స్ తో కొంత వరకు బయటపడ్డాయి. ఈ ధోరణి మనదగ్గర ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో పొరుగు ఇండస్ట్రీలు కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అయిపోతున్నాయి.

ఐతే కోలీవుడ్ దర్శక నిర్మాతలు మరీ ఈ స్థాయిలో ముదిరిపోలేదు. అక్కడ థియేటర్లు తక్కువ కావడంతో ఇలాంటి స్ట్రాటజీలు ప్లే చేస్తే పనవ్వదు. లాంగ్ రన్ లేకుండా పెట్టుబడి రికవరీ కావడం కష్టం. ఐతే రజినీకాంత్ సినిమా ‘కబాలి’ విషయంలో మాత్రం మనోళ్ల కంటే ఓ అడుగు ముందుకేసి విపరీతమైన హైప్ తీసుకొచ్చారు. పొరుగు రాష్ట్రాల్లో.. విదేశాల్లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేసుకునే అవకాశం ఉండటమే దీనికి కారణం. అయినకాడికి రేట్లు పెట్టి సినిమాను అమ్మారు. హైప్ కూడా విపరీతంగా ఉండటం వల్ల టాక్ తో సంబంధం లేకుండా సినిమాకు ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి.

ఇదంతా చూసి సినిమా నిజంగా అంత బాగోలేదా అని సందేహించారు జనాలు. సూపర్ స్టార్ సినిమా టాక్ కు అతీతం అంటూ గొప్పలు చెప్పుకున్నారు. కానీ ‘కబాలి’ బురుగేంటో వీకెండ్ తర్వాత అర్థమైంది. ఆదివారం లోపు టికెట్లు దొరకని వాళ్లు సోమవారానికి టికెట్లు బుక్ చేసుకోవడం వల్ల ఆ రోజు కూడా కలెక్షన్లు బాగున్నాయి కానీ.. మంగళవారం ‘కబాలి’ కలెక్షన్లలో మేజర్ డ్రాప్ కనిపించింది.

తెలుగు రాష్ట్రాల్లో ఆక్యుపెన్సీ 20-30 శాతానికి పడిపోయింది. అటు మల్టీప్లెక్సుల్లో.. ఇటు సింగిల్ స్క్రీన్లలో అన్నిచోట్లా అదే పరిస్థితి. దీంతో ఆరంభంలో ఊపు చూసి సేఫ్ అయిపోతామనుకున్న బయ్యర్లలో ఇప్పుడు ఆందోళన పట్టుకుంది. ‘లింగా’ స్థాయిలో కాకపోయినా కొంత వరకు నష్టాలు తప్పేట్లు లేవు. తొలి నాలుగు రోజుల్లో రూ.20 కోట్ల దాకా షేర్ రాగా.. ఇక సినిమా థియేటర్ల నుంచి లేచిపోయే లోపు రూ.5 కోట్లు వస్తే ఎక్కువ అంటున్నారు.
Tags:    

Similar News