టాప్ బ్యూటీ ఇండస్ట్రీని వదిలేయడానికి కారణం?
ఈ బర్త్ డే వీడియో చూశాక సమీరా తిరిగి సౌత్ లో నటిస్తుందా? అంటూ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాల్లో ప్రశ్నిస్తున్నారు.;
టాలీవుడ్ లో నరసింహుడు, అశోక్ లాంటి క్రేజీ చిత్రాల్లో నటించింది సమీరా రెడ్డి. వరుసగా రెండు సినిమాల్లో అవకాశం కల్పించాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆ సమయంలో రూమర్ల గురించి తెలిసినదే. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి సరసన `జై చిరంజీవ` చిత్రంలోను సమీరా నటించింది. అందమైన చిరునవ్వు, హావభావాలతో ఆకట్టుకునే సమీరా రెడ్డి తెలుగు, తమిళం, హిందీ పరిశ్రమల్లో కొన్నేళ్ల పాటు హవా సాగించింది.
అయితే సమీరా రెడ్డి అనూహ్యంగా పరిశ్రమ నుంచి ఎగ్జిట్ అవ్వడం అభిమానులను చాలా ఆశ్చర్యపరిచింది. 2012లో కృష్ణం వందే జగద్గురుమ్ లో ఒక పాటలో అతిథిగా కనిపించింది. కానీ ఆ తర్వాత తెలుగులో నటించలేదు. మూడు భాషల్లో సమీరా రెడ్డి సూపర్‌హిట్ సినిమాల్లో నటించినా, పరిశ్రమ నుంచి ఎగ్జిట్ అయింది. పెళ్లి తర్వాత పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌కి అంకితమై తిరిగి సినీపరిశ్రమకు రాలేదు. కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంది. సమీరా రెడ్డి ఇటీవల తన 47వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.
ఈ బర్త్ డే వీడియో చూశాక సమీరా తిరిగి సౌత్ లో నటిస్తుందా? అంటూ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాల్లో ప్రశ్నిస్తున్నారు. సమీరా ప్రస్తుతం ఏం చేస్తోంది? అంటూ ఆరాలు తీస్తున్నారు. నిజానికి కెరీర్ కొన్ని ఫ్లాపులతో నెమ్మదించాక, సమీరా రెడ్డి 2014లో వ్యాపారవేత్త అక్షయ్ వర్దేను వివాహం చేసుకుంది. మరుసటి సంవత్సరం (2015) ఒక కుమారుడు జన్మించాడు. 2019లో ఒక కుమార్తె కూడా జన్మించింది. అటుపై పూర్తిగా పిల్లలు, భర్త కుటుంబానికే అంకితమైంది కానీ తిరిగి నటనలోకి రాలేదు.
పిల్లల్ని కనే సమయంలో తన రూపం పూర్తిగా మారిపోవడంతో సమీరా రెడ్డి తీవ్రమైన డిప్రెషన్ కి గురయ్యానని తెలిపారు. గర్భధారణ సమయంలో భావోద్వేగాల గురించి కూడా అభిమానులతో ముచ్చటించారు. ప్రస్తుతం సమీరా తన ఇద్దరు పిల్లలు, కుటుంబంతో సంతోషంగా ఉంది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ఇక సమీరా నటిగా జోరుమీద ఉన్న సమయంలో లాక్మే వంటి టాప్ బ్రాండ్స్ కి ప్రమోషన్స్ చేసింది. ముంబైలో ర్యాంప్ వాక్ లతో బిజీ బిజీగా గడిపేది. ఇటీవల ఫ్యాషన్ షోలకు కూడా సమీరా దూరమైపోయింది. అయితే సమీరా అందమైన రూపం, చిరునవ్వును ఆరాధించిన అభిమానులు ఇప్పటికీ తనను మర్చిపోలేరు. సమీరా రెడ్డి ప్రస్తుతం గోవాలోని పోర్వోరిమ్‌లో నివసిస్తోంది. ఇటీవల ఫిట్‌నెస్ ఫ్రీక్ గా తనను తాను ప్రమోట్ చేసుకుంటోంది. 2026లో ఈ భామ తిరిగి నటనలోకి ఆరంగేట్రం చేయాలని భావిస్తోందిట. ప్రస్తుతం `చిమ్నీ` అనే హారర్-థ్రిల్లర్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుందని సమాచారం.