విజయ్.. సినిమాలో ఆ భజన రిస్కేమో?

రాజకీయ ప్రస్థానం మొదలుపెడుతున్న వేళ ఒక భారీ విజయంతో కెరీర్ ముగించాలని, ఆ జోష్ తో పాలిటిక్స్ లోకి వెళ్లాలని ఆయన చూస్తున్నారు.;

Update: 2025-12-16 06:30 GMT

దళపతి విజయ్ సినిమా కెరీర్ విషయం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. రాజకీయాల్లోకి వెళ్తున్న కారణంగా 'జన నాయకన్' తన ఆఖరి సినిమా అని విజయ్ అధికారికంగా ప్రకటించడంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఎమోషన్ పీక్స్ లో ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు వెండితెరను ఏలిన ఒక స్టార్ హీరోకు ఇది ఫేర్ వెల్ మూవీ కావడంతో అంచనాలు హై లెవెల్లో ఉన్నాయి. బాక్సాఫీస్ పరంగా, కంటెంట్ పరంగా ఈ సినిమా సక్సెస్ కావడం విజయ్ కి ఇప్పుడు చాలా అవసరం.

సాధారణంగా ఏ స్టార్ హీరో అయినా రాజకీయాల్లోకి వెళ్లే ముందు తమ సినిమాలను ఒక వేదికగా వాడుకోవడం మామూలే. డైలాగుల్లోనో, పాటల్లోనో తమ పొలిటికల్ ఎజెండాను చెప్పకనే చెబుతుంటారు. దీనివల్ల వాళ్లకు రాజకీయంగా మైలేజ్ వస్తుంది. విజయ్ కూడా ఇప్పుడు అదే ప్లాన్ లో ఉన్నారు. రాజకీయ ప్రస్థానం మొదలుపెడుతున్న వేళ ఒక భారీ విజయంతో కెరీర్ ముగించాలని, ఆ జోష్ తో పాలిటిక్స్ లోకి వెళ్లాలని ఆయన చూస్తున్నారు.

అయితే అసలు సమస్య ఇక్కడే మొదలవుతోంది. పొలిటికల్ రిఫరెన్సులు ఉండటం వరకు ఓకే కానీ, అవి శృతి మించితేనే ప్రమాదం. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఒక రూమర్ సినిమా ఫలితాన్ని దెబ్బతీసేలా ఉంది. ఈ సినిమా చివర్లో విజయ్ కెరీర్ రౌండప్ ట్రిబ్యూట్ లాగా 15 నిమిషాల పాటు ఒక స్పెషల్ ఎపిసోడ్ పెట్టారని టాక్ వినిపిస్తోంది. సరిగ్గా ఇదే ఇప్పుడు మేకర్స్ చేస్తున్న అతి పెద్ద రిస్క్ అని అంటున్నారు.

సినిమా కథ ఒక ఎమోషనల్ ఫ్లోలో వెళ్తున్నప్పుడు, సడన్ గా కథకు సంబంధం లేని ఇలాంటి వ్యక్తిగత భజన కార్యక్రమాలు వస్తే ఆడియెన్స్ డిస్కనెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. 15 నిమిషాలు అనేది తక్కువ సమయం కాదు. అంతసేపు కేవలం హీరో ఇమేజ్ ను ఎలివేట్ చేయడానికి, పొలిటికల్ గా హైప్ ఇవ్వడానికి వాడితే.. అది సినిమా కోర్ పాయింట్ ను దెబ్బతీస్తుంది. ఆడియెన్స్ మూడ్ ను పూర్తిగా పాడుచేస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' రీమేక్ అనే ప్రచారం బలంగా ఉంది. ఒక రీమేక్ కథను డీల్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి తోడు ఇప్పుడు ఈ ఎక్స్ట్రా హంగులు, ట్రిబ్యూట్ ల పేరుతో కథను పక్కదారి పట్టిస్తే మొదటికే మోసం వస్తుంది. కథలో భాగం కాని అంశాలను బలవంతంగా ఇరికిస్తే ప్రేక్షకులు తిరస్కరించే అవకాశం ఉంది.

ఒకవేళ ఈ ప్రయోగం సక్సెస్ అయితే విజయ్ కు తిరుగులేని సెండ్ ఆఫ్ దొరుకుతుంది. కానీ ఏమాత్రం తేడా కొట్టినా ఆ ప్రభావం ఆయన పొలిటికల్ ఎంట్రీ మీద పడే ఛాన్స్ ఉంది. జనవరి 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో ఆ 15 నిమిషాలు ఆడియెన్స్ కు కనెక్ట్ అవుతుందా లేక విసిగిస్తుందా అనేదే ఇప్పుడు అసలైన సస్పెన్స్.

Tags:    

Similar News