క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడేనా..?

Update: 2022-06-08 02:30 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. 'అతడు' 'ఖలేజా' చిత్రాల తర్వాత వీరి కలయికలో రాబోతున్న #SSMB28 పై అందరిలో అంచనాలు నెలకొన్నాయి.

మహేష్ - త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ని గతేడాదే అనౌన్స్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో లాంఛనంగా ప్రారంభించారు. 'సర్కారు వారి పాట' సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతో.. త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి జర్మనీలో సమ్మర్ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇన్నాళ్లు పెండింగ్ లో ఉన్న సెకండాఫ్ స్క్రిప్ట్ ను పూర్తి చేసిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. స్క్రిప్ట్‌ ను లాక్ చేసి, ఫైనల్ నేరేషన్ ఇవ్వడానికి ఇటీవల జర్మనీకి వెళ్లినట్లు తెలుస్తోంది.

త్రివిక్రమ్ చెప్పిన స్క్రిప్ట్‌ తో చాలా ఇంప్రెస్ అయిన మహేష్ బాబు.. షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేయమని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. జూలైలో ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తుండగా.. నెలాఖరున మహేష్ టీమ్ తో జాయిన్ అవుతాడని అంటున్నారు.

ఈ ఏడాది డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసి 2022 ప్రథమార్థంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఓ భారీ కాలనీ సెట్‌ ను నిర్మించారని సమాచారం.

ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.. మిగతా ప్రధాన పాత్రధారులను త్రివిక్రమ్ ఇప్పటికే ఫైనలైజ్ చేసినట్లు టాక్. SSMB28 అనేది పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైన్ అని సమాచారం. మహేష్ ను సరికొత్తగా ప్రెజెంట్ చేయబోతునన్నారని వినికిడి.

మహేశ్ తో 'అతడు' వంటి క్లాసిక్ ను తెరకెక్కించిన త్రివిక్రమ్.. 'ఖలేజా' తో ప్లాప్ అందించారు. అయినప్పటికీ ఈ సినిమాలు స్మాల్ స్క్రీన్ మీద ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఈ క్రమంలో ఇప్పుడు దాదాపు పన్నెండేళ్ల తర్వాత హ్యాట్రిక్ మూవీతో దర్శక హీరోలు ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆర్. మది సినిమాటోగ్రాఫర్ గా.. నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేయనున్నారు.
Tags:    

Similar News