చదువులో ఫెయిల్… కానీ లైఫ్ లో విన్నర్!
ఢిల్లీ జానక్‌పురిలోని ఒక జిమ్‌లో జరిగిన చిన్న సంఘటన అతని జీవితాన్నే మలిచిందని, ఆ సమయంలో జిమ్ లోని ఒక యువతికి సహాయం చేసిన తరువాత, ఆమె నుంచి వచ్చిన లేఖ అతనికి తన టార్గెట్ ను గుర్తు చేసింది.;
బాలీవుడ్‌లో సక్సెస్ స్టోరీలు చాలానే ఉంటాయి. కానీ కొన్ని కథలు మాత్రం సాధారణ విజయాన్ని మించి, జీవితాన్ని కొత్తగా నిర్వచిస్తాయి. అలాంటి అరుదైన ప్రయాణాల్లో ఒకటి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే ముస్తఫా అహ్మద్ కథ. ప్రస్తుతం దురంధర్: ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుండగా, మూవీలో రణ్‌వీర్ సింగ్ యాక్టింగ్ కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అదే సమయంలో, ఆయన పక్కన కనిపిస్తున్న మరో వ్యక్తి గురించి కూడా ఆడియన్స్ చర్చిస్తున్నారు. అతడే ముస్తఫా అహ్మద్. ఈ సినిమాలో ఇంటెలిజెన్స్ ఏజెంట్ రిజ్వాన్ షా పాత్రలో అతని నటన ప్రత్యేకంగా నిలిచింది.
కాల్ సెంటర్ లో నెలకు రూ.1 లక్ష జీతం
ముస్తఫా జర్నీ సినీ ప్రపంచంతో మొదలవలేదు. చిన్నతనంలోనే డిస్లెక్సియా(కంటి చూపు) సమస్యతో బాధపడుతూ, చదువులో వెనుకబడ్డాడు. చివరికి స్కూల్‌ను వదిలేయాల్సి వచ్చింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితులు చాలా మందిని వెనక్కి నెడతాయి. కానీ ముస్తఫా మాత్రం తనలోని బలాన్ని గుర్తించారు. 21 ఏళ్ల వయసులో కాల్ సెంటర్‌లో మేనేజర్ గా నెలకు లక్ష రూపాయలు సంపాదించే ఉద్యోగాన్ని వదిలి, కేవలం రూ.10,000 జీతంతో జిమ్ ట్రైనర్‌గా మారడం అతని జీవితాన్ని మార్చేసింది. ఈ నిర్ణయం అతని కుటుంబాన్ని కూడా షాక్‌కు గురిచేసింది. కానీ అదే నిర్ణయం అతన్ని పూర్తిగా మార్చింది.
జాబ్ ను వదిలి ఫిట్‌నెస్ ట్రైనర్ గా
ఢిల్లీ జానక్‌పురిలోని ఒక జిమ్‌లో జరిగిన చిన్న సంఘటన అతని జీవితాన్నే మలిచిందని, ఆ సమయంలో జిమ్ లోని ఒక యువతికి సహాయం చేసిన తరువాత, ఆమె నుంచి వచ్చిన లేఖ అతనికి తన టార్గెట్ ను గుర్తు చేసింది. అదే ఫిట్‌నెస్ ద్వారా జీవితాలను మార్చడం. తర్వాత ఫిట్‌నెస్ ఫస్ట్ లో ఛాన్స్ రావడం అతని కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. మొదట్లో తక్కువ జీతంతో మొదలైనప్పటికీ, కొన్ని నెలల్లోనే అతను భారీ డిమాండ్ ఉన్న ట్రైనర్‌గా మారారు. రోజుకు 14 సెషన్స్ తీసుకుంటూ, నెలకు లక్షల్లో సంపాదించడం ప్రారంభించారు.
పలువురు సెలబ్రిటీలకు ట్రైనర్ గా..
అక్కడి నుంచి అతని ప్రయాణం బాలీవుడ్ వరకు చేరింది. హృతిక్ రోషన్, రణ్‌వీర్ సింగ్, విక్కీ కౌశల్ లాంటి స్టార్ హీరోలకు ట్రైనర్‌గా ఎంపిక కావడం అతని కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఆ తర్వాత అతను ఇండస్ట్రీలో ప్రముఖ ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్‌గా పేరు సంపాదించారు. అయితే అతని కథ అక్కడితో ఆగలేదు. డైరెక్టర్ ఆదిత్యధర్ ప్రోత్సాహంతో, ముస్తఫా నటుడిగా మారారు. మొదట తనపై తానే అనుమానపడ్డప్పటికీ, ఆదిత్యధర్ నమ్మకం తనికి ధైర్యాన్నిచ్చిందని అతను రీసెంట్ గా ఓ పాడ్‌కాస్ట్ లో తెలిపారు. ఇప్పుడు ధురంధర్ ఫ్రాంచైజీలో రిజ్వాన్ పాత్ర ద్వారా అతను ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ క్యారెక్టర్ కేవలం యాక్షన్ పాత్ర మాత్రమే కాదు, కథలో కీలకమైన ఎమోషన్ ను కూడా మోస్తుంది. ముస్తఫా లైఫ్ స్టోరీని చూస్తే ఓ విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. సక్సెస్ కు కేవలం ఒకటే మార్గముండదని, చదువులో వెనుకబడ్డా,లైఫ్ అక్కడితో ఆగిపోదని, మనలోని సరైన టాలెంట్ ను గుర్తించి, పట్టుదలతో ముందుకు సాగితే, జీవితమే కొత్త వేదికగా మారుతుందని నిరూపిస్తోంది.