జ‌క్క‌న్న సినిమాకు... కేటీఆర్ పేరు పెట్టాడే

Update: 2019-04-28 12:35 GMT
టాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ ఎస్ రాజ‌మౌళి ప్రతిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం # RRR. యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌ - మెగా ప‌వ‌ర్ స్టార్ రాంచ‌రణ్ తేజ్ ల‌ను ఒకే స్క్రీన్ మీద‌కు తెచ్చేసి భారీ మ‌ల్టీ స్టార‌ర్‌ గా రాజ‌మౌళి తీస్తున్న ఈ చిత్రంపై ఏ చిన్న వార్త వ‌చ్చినా వైర‌లే అవుతోంది. ఇలాంటి త‌రుణంలో సినిమాల‌పై త‌న‌దైన శైలి కామెంట్లు చేసే అల‌వాటు ఉన్న టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు ఈ సినిమాపై ఆస‌క్తిక‌ర కామెంట్ చేశారు. కామెంట్ చేయ‌డమే కాదండీ బాబూ... ఏకంగా ఈ చిత్రానికి పేరు కూడా పెట్టేశారు.

నేటి మ‌ధ్యాహ్నం ట్విట్ట‌ర్ వేదిక‌గా *ఆస్క్ కేటీఆర్‌* పేరిట ప్ర‌జ‌ల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చేందుకు ఎంట్రీ ఇచ్చిన కేటీఆర్... నెటిజ‌న్లు అడిగిన ప్ర‌తి ప్ర‌శ్న‌కు కూడా త‌న‌దైన శైలిలో స్పందించారు. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాకు సంబంధించి ఎదురైన ప్ర‌శ్న‌కు స్పందించిన కేటీఆర్‌... ఆ సినిమాకు తానైతే ఈ పేరు పెడ‌తానంటూ ఓ ఆస‌క్తిక‌ర పేరును ప్ర‌స్తావించారు. #RRR సినిమాకు మీరే టైటిల్ చెప్పండంటూ రాజ‌మౌళి... తార‌క్ - చెర్రీ అభిమానులకు ఓ పజిల్ విసిరిన సంగ‌తి తెలిసిందే క‌దా.

ఈ క్ర‌మంలోనే ట్విట్ట‌ర్ ఇంట‌రాక్ష‌న్ లో రాజ‌మౌళి ప‌జిల్ ను ప్ర‌స్తావించిన ఓ నెటిజ‌న్... మీరైతే ఈ సినిమాకు ఏం టైటిల్ సూచిస్తారని కేటీఆర్‌ ను ప్రశ్నించాడు. తానేమో పొలిటీషియ‌న్‌ - ప్ర‌శ్నేమో సినిమాల‌కు సంబంధించిన‌ది. ఈ క్ర‌మంలో కేటీఆర్ స్పందిస్తారా? అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతూ ఉంటే... కేటీఆర్ అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తూ ఈ ప్ర‌శ్న‌కు చాలా స్ట్రైట్ గా స్పందించేశారు. #RRR సినిమాకు నేనైతే... *రీజనల్ రింగ్ రోడ్* అని పేరు పెడ‌తానంటూ ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు. మ‌రి కేటీఆర్ సూచించిన ఈ టైటిల్ ను జ‌క్క‌న్న ఏ మేర‌కు ప‌రిశీలిస్తారో చూడాలి.

Tags:    

Similar News