కొర‌టాల కు ఫ్రీడ‌మ్ ఇవ్వ‌లేదా?

Update: 2022-05-05 03:30 GMT
ఒక సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయితే అది ఎందుకు ఈ రేంజ్ హిట్ అయింద‌ని వెత‌కేవారు వుండ‌రు కానీ ఓ సినిమా డిజాస్ట‌ర్ అయితే అస‌లు ఏం జ‌రిగింది? .. ఎందుకిలా జ‌రిగింది. ఇంత‌కీ త‌ప్పెవ‌రిది? అనే కోణంలో విశ్లేష‌ణ‌లు జ‌ర‌గ‌డం కామన్‌. కానీ `ఆచార్య‌` విష‌యంలో చాలా వ‌ర‌కు చాలా మంది డైరెక్ట‌ర్ నే కార్న‌ర్ చేయ‌డం జ‌రిగింది. మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలిసారి క‌లిసి న‌టించిన చిత్రం `ఆచార్య‌`. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ మూవీ ఊహించ‌ని విధంగా డిజాస్ట‌ర్ టాక్ ని తెచ్చుకుంది.

తొలి రోజు తొలి షో నుంచే ఈ టాక్ వినిపించింది. చిరు నుంచి దాదాపు రెండేళ్ల విరామం త‌రువాత వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఫ్యాన్స్ ఈ మూవీపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. చిరు, చ‌ర‌ణ్ క‌లిసి చేసిన సినిమా అని అంత‌కు మించి ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ సినిమా ఆస్థాయిలో లేక‌పోవ‌డంతో పెద‌వి విరుస్తూ అసంతృప్తిని వ్య‌క్తం చేయ‌డం తెలిసిందే. డైరెక్ట‌ర్ స‌రైన క‌థ‌ని ఎంచుకోలేద‌ని, ఇద్ద‌రు స్టార్ ల‌ని తీసుకుని ఇలాంటి సినిమాని అందించాడ‌ని విమ‌ర్శ‌లు చేయ‌డం మొద‌లు పెట్టారు.

ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌ని టార్గెట్ చేయ‌డం ప్రారంభించారు. అయితే `మిర్చి` నుంచి భ‌ర‌త్ అనే నేను` వ‌ర‌కు కొర‌టాల సినిమాల్లో ఒక్క హిట్టు లేదు.. అన్నీ బ్లాక్ బ‌స్ట‌ర్ లే. ప్ర‌భాస్ తో `మిర్చి`, మ‌హేష్ బాబుతో శ్రీ‌మంతుడు, భ‌ర‌త్ అనే నేను, ఎన్టీఆర్ తో `జ‌న‌తా గ్యారేజ్‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ లు అందించారు. ఈ సినిమాల‌న్నీ ఫ్లాపుల్లో వున్న ప్ర‌భాస్, మ‌హేష్ బాబు, ఎన్టీఆర్ ల‌ని మ‌ళ్లీ ట్రాక్ లోకి నిల‌బెట్టాయి. క్రేజీ స్టార్ ల రేస్ లో ముందు వ‌రుస‌లో చేర్చాయి.

ఇలాంటి ట్రాక్ రికార్డ్ వున్న కొర‌టాల శివ `ఆచార్య‌` తీశాడంటే న‌మ్మ‌డం క‌ష్ట‌మే. తెర వెనుక ఆయ‌న‌కు ఫ్రీడ‌మ్ ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల్లే ఇదంతా జ‌రిగింద‌న్న‌ది ఇన్ సైడ్ టాక్‌. సినిమా ప్రారంభం నుంచి వివిధ వివాదాల‌తో సాగింది. ముందు అనుకున్న కెమెరామెన్ త‌ప్పుకోవ‌డం.. ఆ త‌రువాత కార‌వ్యాన్ ల వివాదం.. త‌రువాత త్రిష సినిమా నుంచి త‌ప్పుకుంటూ వివాదాస్ప‌దంగా ట్వీట్ చేయ‌డం.. ఫైనల్ గా కాజ‌ల్ ని నాలుగు రోజులు షూటింగ్ చేశాక త‌న పాత్ర ఏమంత బాగాలేద‌న్న చిన్న కార‌ణంతో త‌న‌ని సినిమా నుంచే తొల‌గించ‌డం వంటి విచిత్రాలు చాలా వ‌ర‌కు జ‌రిగాయి.

ఇంత జ‌ర‌గ‌డంతో కొర‌టాల‌కు ఫ్రీ హ్యాండ్ ఇవ్వ‌లేద‌న్న వాద‌న‌కు బ‌లం చేకూరుతోంద‌ని కొంత మంది ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నారు. ఫ్లాప్ అనే ప‌దం ఎరుగ‌ని డైరెక్ట‌ర్ యావ‌రేజ్ హిట్ ఇస్తాడు.. కానీ ఇలా డిజాస్ట‌ర్ ఇచ్చే ప్ర‌స‌క్తిలేద‌ని బ‌లంగా వాదిస్తున్నారు. ఫ్రీడ‌మ్ ఇచ్చి వుంటే ఫ‌లితం మ‌రోలా వుండేద‌ని చెబుతున్నారు. మ‌రి ఇందులో వున్న నిజ‌మెంత‌?.. నిజంగానే క‌మ‌ర్షియ‌ల్ వ‌య‌బిలిటీస్ కోసం కొర‌టాల కు ఫ్రీ హ్యాండ్ ఇవ్వ‌లేదా?.. అన్నింటికీ స‌మాధానం ఎన్టీఆర్ తో చేయ‌బోయే సినిమా ఫ‌లితం చెబుతుంద‌న్న‌ది ఇండ‌స్ట్రీ వ‌ర్గాల వాద‌న.
Tags:    

Similar News